Begin typing your search above and press return to search.

వాట్సాప్..వాట్సాప్.. అంటే హిట్లు రావు: బండ్ల గణేష్

బండ్ల గణేష్ మరోసారి తన "ర్యాంపేజ్" స్పీచ్‌తో దుమ్మురేపారు. ఈసారి ఆయన యంగ్ హీరో కిరణ్ అబ్బవరంను ఆకాశానికెత్తేశారు.

By:  M Prashanth   |   4 Nov 2025 9:51 AM IST
వాట్సాప్..వాట్సాప్.. అంటే హిట్లు రావు: బండ్ల గణేష్
X

బండ్ల గణేష్ మైక్ పట్టుకున్నాడంటే అక్కడ వైబ్స్ వేరే లెవల్‌లో ఉంటాయి. ఆయన స్పీచ్‌లు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా, 'K ర్యాంప్' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో, బండ్ల గణేష్ మరోసారి తన "ర్యాంపేజ్" స్పీచ్‌తో దుమ్మురేపారు. ఈసారి ఆయన యంగ్ హీరో కిరణ్ అబ్బవరంను ఆకాశానికెత్తేశారు.

"ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ వాట్సాప్ అంటూ, లూజ్ లూజ్ ప్యాంట్స్ వేసుకుంటూ రాత్రిపూట కళ్లద్దాలు పెట్టుకుని తిరిగే ఈ రోజుల్లో.. హిట్టు మీద హిట్టు కొడుతున్నా, మన ఇంట్లో కుర్రాడిలా, నా కొడుకులా, నా తమ్ముడిలా ఉన్నావ్" అంటూ కిరణ్ అబ్బవరం హంబుల్‌నెస్‌ను బండ్ల గణేష్ పొగడ్తలతో ముంచెత్తారు.

అంతేకాదు, "నిన్ను చూస్తుంటే నాకు చిరంజీవి గారు గుర్తొస్తున్నారు. ఆయన స్టార్టింగ్ రోజుల్లో ఇలాగే ఉండేవారు" అని మెగాస్టార్‌తో పోల్చి సంచలనం రేపారు. కిరణ్ జర్నీని గుర్తుచేస్తూ.. "ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి, రాయచోటి అనే ఊరి నుంచి వచ్చి, బెంగళూరులో జాబ్ చేస్తూ, హీరో కావాలనే సంకల్పంతో ఇండస్ట్రీకి వచ్చావ్. నీది నిజమైన కష్టం" అని బండ్ల అన్నారు.

"కళామతల్లిని నమ్ముకున్నోడు ఎవరూ చెడిపోలేదు" అని యంగ్ టాలెంట్‌కు భరోసా ఇచ్చారు. ఇదే ఊపులో, హిట్టు కొట్టిన హీరోల తీరుపై బండ్ల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. "ఒక్క సినిమా హిట్ కొడితే చాలు.. నాకు లోకేష్ కనగరాజ్ కావాలి, రాజమౌళి కావాలి, సుకుమార్ కావాలి, అనిల్ రావిపూడి కావాలి అనే ఈ రోజుల్లో, కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు ఆరుగురు కొత్త డైరెక్టర్లను పరిచయం చేశాడు. మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నాడు. దమ్మున్న, ధైర్యమున్న, కలేజా ఉన్న రియల్ హీరో ఇతను" అని గట్టిగా చెప్పారు.

మిగిలిన హీరోలకు కూడా బండ్ల చురకలు అంటించారు. "మీరు కూడా ఒకప్పుడు కొత్తవాళ్లే కదా, గతాన్ని మర్చిపోకండి. ఏడాదికి ఒక కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయండి. ఈ కుర్రాడిని చూసి నేర్చుకోండి" అని అన్నారు. స్టేజ్‌పై ఉన్న నిర్మాత రాజేష్‌ను ఉద్దేశించి, "సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్‌లు వర్కవుట్ అవ్వవు తమ్ముడూ, ఇక్కడ రిక్వెస్టులే పనిచేస్తాయి, వార్నింగ్‌లు రాజకీయాల్లో ఇచ్చుకోవాలి" అంటూ ఫన్నీగా కౌంటర్ వేశారు.

చివరగా, "తెలివి, సక్సెస్ వారసత్వంగా రావు. వెయ్యి కోట్లు ఇస్తే ఒక గబ్బర్ సింగ్ తీయగలరా? దానికి దమ్ము కావాలి, దేవుడి దయ కావాలి, కష్టం కావాలి. ప్రేమతో, కష్టంతో చేస్తే బ్లాక్‌బస్టర్ వస్తుంది కానీ, వాట్సాప్ వాట్సాప్ అంటే హిట్లు రావు" అంటూ బండ్ల గణేష్ తన స్పీచ్‌తో ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచారు.