ఎవరినీ తొక్కలేదు.. అందర్నీ ఎక్కించాడు.. బండ్ల గణేష్ ఎమోషనల్ స్పీచ్
మైక్ పట్టుకోవడానికి బండ్ల గణేష్ వస్తున్నాడంటే అభిమానుల్లో వచ్చే పూనకాలు మామూలుగా ఉండవు. ఆయన స్పీచ్‌లకు బయట ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 22 Aug 2026 10:36 AM ISTమైక్ పట్టుకోవడానికి బండ్ల గణేష్ వస్తున్నాడంటే అభిమానుల్లో వచ్చే పూనకాలు మామూలుగా ఉండవు. ఆయన స్పీచ్‌లకు బయట ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. నిన్న జరిగిన మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకల్లో కూడా బండ్ల గణేష్ తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు. దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ, మెగాస్టార్ వ్యక్తిత్వం గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
వేదికపైకి రాగానే జై చిరంజీవ.. జగదేక వీరా అంటూ తన స్పీచ్ మొదలుపెట్టిన బండ్ల గణేష్, ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్ తన అభిమానులకు, ఎందరో కార్మికులకు ఎలా అండగా నిలబడుతున్నారో గుర్తుచేశారు. ఆయన ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే, తనలాంటి వాళ్లకు ఇక్కడ అడ్రస్ ఉండేది కాదని ఎమోషనల్ అయ్యారు. ఏడు కోట్ల తెలుగు ప్రజలకు ఆయనొక భరోసా అని, నిరంతరం వెలుగుతూ పది మందికి వెలుగునిస్తున్నారని కొనియాడారు.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా చెన్నైలో అడుగుపెట్టిన కుర్రాడు.. ఈరోజు ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించాడని బండ్ల గణేష్ అన్నారు. కష్టపడితే ఎవరైనా ఇండస్ట్రీలో పైకి రావొచ్చనే నమ్మకాన్ని, ధైర్యాన్ని సాధారణ జనాలకు కల్పించింది చిరంజీవి మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఆ నమ్మకంతోనే ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి తమ కలలను నెరవేర్చుకుంటున్నారని అన్నారు.
ఇదే వేదికపై ఎంతో మంది దేవుళ్ల మీద ఒట్టేసి మరీ బండ్ల గణేష్ కొన్ని నిజాలు చెబుతున్నానంటూ మాట్లాడారు. భారతదేశంలో ఏ సూపర్ స్టార్ కొడుకు కూడా తండ్రిని మించిన స్థాయికి వెళ్లలేదని, కానీ రామ్ చరణ్ రూపంలో ఆ రికార్డును చిరంజీవి తిరగరాశారని ఆయన ప్రశంసించారు. తన లెగసీని కంటిన్యూ చేసేలా ఒక గ్లోబల్ స్టార్‌ను ఇండస్ట్రీకి అందించిన ఘనత ముమ్మాటికీ మెగాస్టార్‌కే దక్కుతుందని గట్టిగా చెప్పారు.
ఇక చిరంజీవి ఇతరులను తొక్కేస్తాడు అనే కామెంట్స్ పైనా బండ్ల గణేష్ తన స్టైల్‌లో సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి ఎవరినీ తొక్కలేదని, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ పైకి ఎక్కించి తన పక్కన కూర్చోబెట్టుకున్నారని ఆయన అన్నారు. తనలో ఏమాత్రం స్వార్థం లేదని, తాను మాత్రమే కాదు.. తన కుటుంబం, తన చుట్టూ ఉన్నవాళ్లు, ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి చిరంజీవి అని బండ్ల అన్నారు.
గతంలో చిరంజీవిని విమర్శించిన వాళ్లు కూడా ఇప్పుడు ఆయన స్థాయిని చూసి ఆశ్చర్యపోతున్నారని బండ్ల అన్నారు. తనను ఎన్ని మాటలు అన్నా, ఎవరైనా కార్యక్రమానికి పిలిస్తే ఎలాంటి బేషజాలు లేకుండా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం అని చెప్పారు. భవిష్యత్ తరాలకు ఆయన జీవితం ఒక రామాయణం, భగవద్గీత, స్వాతంత్ర్య పోరాటం లాంటిదని, రాబోయే తరం నటీనటులకు ఆయనొక పాఠ్యపుస్తకం అని బండ్ల గణేష్ తన స్పీచ్‌లో పవర్ఫుల్ గా ఎలివేషన్స్ ఇచ్చారు.
