Begin typing your search above and press return to search.

బండ్ల గణేష్‌కు ఏడాది జైలు.. ఇప్పుడు ఏం చెబుతారో!

చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా ఎదుర్కొంటున్న బండ్ల గణేష్ ఇప్పటివరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లుతో ఆర్థిక లావాదేవీలే కేసుకు కారణం. పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆయన అప్పీల్ చేశారా, స్టే తెచ్చుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

By:  M Prashanth   |   18 Nov 2026 10:30 PM IST
బండ్ల గణేష్‌కు ఏడాది జైలు.. ఇప్పుడు ఏం చెబుతారో!
X

నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్‌కు కోర్టు వ్యవహారం తలనొప్పిగా మారింది. చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించిన వార్తలు బుధవారం పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే నిత్యం ఏదో ఒక అంశంపై స్పందించే బండ్ల గణేష్ మాత్రం ఈ వ్యవహారంపై ఇంకా పెదవి విప్పలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లుతో జరిగిన ఆర్థిక లావాదేవీల కారణంగా బండ్ల గణేష్‌పై చెక్ బౌన్స్ కేసు నమోదైంది.

రూ.95 లక్షలకు సంబంధించిన చెక్కు చెల్లకపోవడంతో వెంకటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. ఈ కేసు 2024 ఫిబ్రవరి నుంచే కొనసాగుతోంది. అయితే బండ్ల గణేష్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు ఆర్థిక వ్యవహారాలతో కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి.

సినీ నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో 'గబ్బర్ సింగ్', అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', ఎన్టీఆర్‌తో 'టెంపర్' వంటి సినిమాలు నిర్మించారు. కొన్నేళ్లుగా మాత్రం సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటూ వ్యాపారాలు, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బండ్ల గణేష్ స్పందించే తీరు గురించి తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తుంటారు. తనపై వచ్చే విమర్శలకు కూడా అప్పుడప్పుడు ఘాటుగా కౌంటర్లు ఇస్తుంటారు. అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు తన జైలు శిక్ష వ్యవహారంపై ఎలాంటి వివరణ ఇస్తారనేది చూడాలి. కేసు ప్రస్తుత పరిస్థితి గురించి కూడా ఆయన నుంచి సమాచారం రావాల్సి ఉంది.

ఇక ఒంగోలు కోర్టు తీర్పు వెలువడిన సమయంలో పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు నెల రోజుల గడువు ఇచ్చారు. అయితే ఆ తర్వాత అప్పీల్ దాఖలు చేశారా, శిక్షపై స్టే లభించిందా అనే వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఏడాది జూలైలో ఆయన కుటుంబానికి చెందిన షేక్‌పేట ఆస్తి వేలానికి సంబంధించిన బ్యాంకు వివాదంలోనూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక ఈ విషయంలో బండ్ల గణేష్ ఎలాంటి. క్లారిటీ ఇస్తారో చూడాలి.