బండ్ల గణేష్ రీ ఎంట్రీ.. కొడుకుతోనా? స్టార్‌తోనా?
ఇక్కడ ఆయన కొడుకు ఎంట్రీ కూడా మరోసారి హైలెట్ అవుతోంది. తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తానని బండ్ల గతంలోనే చెప్పారు.
By: M Prashanth | 23 Aug 2026 12:00 PM ISTబండ్ల గణేష్ నిర్మాతగా చేసిన సినిమాలు చిన్నవేమి కావు. పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’, రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’ ఇలా ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. చివరిగా ఆయన నిర్మించిన ‘టెంపర్’ వచ్చి కూడా పదేళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి నిర్మాతగా మాత్రం మరో సినిమా మొదలుపెట్టలేదు.
అయితే సినిమాలకు పూర్తిగా దూరమైనట్లు బండ్ల గణేష్ ఎప్పుడూ మాట్లాడలేదు. మీడియా ముందుకు వచ్చినప్పుడు మళ్లీ సినిమాలు నిర్మిస్తానని చెబుతూనే ఉన్నారు. కొత్త దర్శకులు, కొత్త కుర్రాళ్లు తన దగ్గర ఉన్నారని కూడా గతంలో చెప్పారు. కానీ ఆయన చెప్పిన ప్రాజెక్టులు ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ ఎప్పుడు కనిపిస్తారన్న ప్రశ్న అలాగే ఉండిపోయింది.
ఇక్కడ ఆయన కొడుకు ఎంట్రీ కూడా మరోసారి హైలెట్ అవుతోంది. తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తానని బండ్ల గతంలోనే చెప్పారు. ఈమధ్య జరిగిన ఆయన కూతురి పెళ్లి వేడుకలో కొడుకు చేసిన డ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో బాగా తిరిగింది. డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధమైన తీరు, స్టేజ్‌పై కనిపించిన విధానం చూస్తే సినిమాల్లోకి వచ్చే ముందు అతన్ని సిద్ధం చేస్తున్నారా అనే టాక్ కూడా మొదలైంది.
అదే జరిగితే బండ్ల గణేష్ నిర్మాతగా రీ ఎంట్రీకి కొడుకు సినిమానే ఎంచుకుంటారా అన్నది చూడాలి. ఎందుకంటే కొత్త హీరోను పరిచయం చేయాలంటే నిర్మాతగా కూడా ఆయనకు చాలా పని ఉంటుంది. సరైన దర్శకుడిని పట్టుకోవడం నుంచి కొడుకుకు సరిపోయే కథను ఎంచుకోవడం వరకు అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంటుంది. సొంత నిర్మాణంలో హీరోగా పరిచయం చేస్తే కావాల్సినంత సమయం తీసుకునే వీలు కూడా ఉంటుంది.
కానీ బండ్ల గణేష్ గతం చూస్తే మరో లెక్క కూడా ఉంది. ఆయన నిర్మాతగా పేరు తెచ్చుకున్నదే స్టార్ హీరోల సినిమాలతో. పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయాలనే కోరికను కూడా చాలాసార్లు బయటపెట్టారు. అందుకే రీ ఎంట్రీ కోసం ముందుగా ఒక స్టార్ సినిమాను పట్టుకుని, ఆ తర్వాత కొడుకు సినిమాకు వెళ్లినా ఆశ్చర్యం లేదు.
ప్రస్తుతం మాత్రం ఈ రెండింటిలో ఏది ముందు జరుగుతుందనే క్లారిటీ లేదు. ఒకవైపు కొడుకు హీరో ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బండ్ల మాత్రం నిర్మాతగా భారీ సినిమా చేయాలనే మాటను వదలడం లేదు. మరి ఆయన ప్లాన్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
