ఒక్క సినిమా ఇవ్వు బాబు... బ్లాక్‌బస్టర్ తీస్తా.. బండ్లన్న కల ఫలించేనా?
నిజానికి టాలీవుడ్ నటుడిగా కెరీర్ సాగించిన బండ్ల గణేష్ సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. నిర్మాతగా మారడానికి ముందు అతడు చాలా సినిమాలలో సహాయ నటుడిగా కీలక పాత్రలు పోషించారు.
By: Sivaji Kontham | 4 Oct 2026 1:37 PM ISTటాలీవుడ్‌లో తనదైన శైలి మాటలతో, ఎనర్జిటిక్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. పవన్ కళ్యాణ్, రవితేజ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఒక ఈవెంట్ వేదికగా అక్కినేని నాగచైతన్యను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా చర్చకు దారితీశాయి. ``ఒక్క సినిమా ఇవ్వు బాబు... బ్లాక్‌బస్టర్ తీస్తా`` అంటూ నాగచైతన్యను బండ్ల గణేష్ కోరిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.
నిజానికి టాలీవుడ్ నటుడిగా కెరీర్ సాగించిన బండ్ల గణేష్ సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. నిర్మాతగా మారడానికి ముందు అతడు చాలా సినిమాలలో సహాయ నటుడిగా కీలక పాత్రలు పోషించారు. సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ వంటి ఎవర్ గ్రీన్ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మారి `ఆంజనేయులు`, `తీన్మార్`, `గబ్బర్ సింగ్`, `బాద్‌షా`, `ఇద్దరు అమ్మాయిలతో` వంటి భారీ చిత్రాలను టాలీవుడ్‌కు అందించారు. రాజకీయాల పరంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, `మా` (MAA) ఎన్నికల్లో పోటీ అంటూ ప్రకటనలతోనే అతడు తనదైన చతురతను ప్రదర్శించారు.
అయితే ఇటీవల బండ్లన్న జీవితంలో ఒక కీలక మలుపు. ఆయన తన గారాల కుమార్తె వివాహాన్ని అత్యంత వైభవంగా, సినీ-రాజకీయ ప్రముఖుల సమక్షంలో నిర్వహించి పెద్ద బాధ్యతను విజయవంతంగా నెరవేర్చారు బండ్ల గణేష్. ఈ వేడుకల అనంతరం పూర్తిస్థాయిలో మళ్లీ సినిమాలపై తన దృష్టిని సారించినట్లు కనిపిస్తోంది. కేవలం పెద్ద హీరోలే కాకుండా, నేటితరం యువ హీరోలతో కూడా సినిమాలు చేయాలనే ఉత్సాహంతో ఆయన ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో భాగంగానే యంగ్ అండ్ స్టైలిష్ హీరో నాగచైతన్యను కలవడం.. తన మనసులోని మాటను బయటపెట్టి సినిమా అవకాశం అడగడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు నాగచైతన్య ఇటీవల `దాసొస్` (DASOS) స్టూడియో ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఈవెంట్‌లో ఆయన చాలా స్టైలిష్‌గా, సరికొత్త లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫిదా అయిపోయారు. వయసు రీత్యా 40 ఏళ్లకు దగ్గరవుతున్నా చైతూ అందం, ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి తరంలో నాగచైతన్యనే వన్ అండ్ ఓన్లీ `స్టైలిష్ స్టార్` అంటూ ఎక్స్ (X) వేదికగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తుండగా.. శోభిత దూళిపాళ చాలా లక్కీ అంటూ సరదా కామెంట్లు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఇలా ఒకవైపు నాగచైతన్య తన మోస్ట్ స్టైలిష్ లుక్స్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తుంటే.. మరోవైపు బండ్ల గణేష్ ఆయనతో సినిమా తీస్తానంటూ బహిరంగంగానే తన కోరికను బయటపెట్టారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అతడి చేతిలో ఉన్న లైనప్ - కమిట్‌మెంట్లను బట్టి చూస్తే.. బండ్లన్న కు చైతూ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ కుదిరితే మాత్రం టాలీవుడ్‌లో మరో మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్‌టైనర్ ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
