కుర్రాళ్లకు బండ్లన్న విలువైన సలహాలు!
సక్సెస్ అయితే ఇండస్ట్రీ సలాం కొడుతుంది. నీకు గులాం అవుతుంది. హీరో కోసం దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉంటారు.
By: Srikanth Kontham | 8 Nov 2025 4:00 AM ISTసక్సెస్ అయితే ఇండస్ట్రీ సలాం కొడుతుంది. నీకు గులాం అవుతుంది. హీరో కోసం దర్శకులు, నిర్మాతలు క్యూలో ఉంటారు. అప్పుడు నువ్వు ఏది చెప్పినా చెల్లుతుంది. ఏం చేసినా అదే రైట్ అవుతుంది. నువ్వు చేసేది తప్పు అయినా? దాన్ని ఎవరూ ఖండించరు. తప్పునే ఒప్పు అంటూ ప్రోత్సహిస్తారు. నీ ముందు చేతులు కడతారు. ఇలా ఎంత కాలం అంటే సక్సెస్ నీ వెంట ఉన్నంత కాలం సాగుతుంది. అదే సక్సెస్ ఒక్కసారి నీకు దూరమైతే? నీ వెంట ఎవరూ ఉండరు. నిన్ను రైట్ అన్న వాళ్లే నువ్వు చేసింది తప్పు? అంటారు. అందుకే నీ కెరీర్ ఇలా అయిందంటూ క్లాస్ లు పీకుతారు.
సింపుల్ గా ఇండస్ట్రీ అంటే ఇదేనని అక్కడ తిరిగిన వారందరికీ తెలుసు. నిర్మాత బండ్ల గణేష్ ఇదే అర్దం వచ్చేలా ఓ యువ నటుడి కెరీర్ ని ఉద్దేశించి మాట్లాడారు. స్టార్ హీరోలను పొగడ్తలతో బుట్టలో వేయడంలో గణేష్ ని మించి ఎవరూ సాటి రారు. కానీ నటుడు మౌళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం నవతరం నటులంతా దృష్టిలో పెట్టుకోవాల్సినవే. సక్సెస్ తలెక్కించుకుని ఇండస్ట్రీలో తిరిగితే తర్వాత సన్నివేశం ఎలా ఉంటుందో చెప్పాడు. ఈరోజు నిజం మరో గంటలోనే అబద్దంగా మారిపోతుందన్నాడు. `ఈ ట్వీట్లు, పొగడ్తలు అంతా అబద్ధం.
ఎవడు బాగుంటే.. వాడి దగ్గరకు వెళ్లి ఏదేదో చెబుతారు. అవన్నీ నమ్మకు. నమ్మితే.. ఈ ఇండస్ట్రీ మాఫియా బతకనివ్వదు. నీ ముందు విజయ్, మహేష్ ఎందుకు పనికొస్తారు అంటారు? అవన్నీ నమ్మకు. నువ్వు చంద్రమోహన్ లా రాణించాలి. నువ్వు మంచి నటుడిగా ఉండు. రౌడీ షర్టు ఇచ్చాడు. మహేష్ ట్వీట్ వేశాడు.. అని ఫీలైపోకు. ఇంకో ఫ్రైడే.. ఇంకో మౌళి వస్తాడు. ఎవర్నీ నమ్మకు.. ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండు.. చెడు అలవాట్లు చేసుకోకు అంటూ విలువైన సూచనలు చేశాడు. గణేష్ చెప్పింది అక్షర సత్యం. తన అనుభవాలు..తాను చూసిన నటుల నుంచి తెలుసుకున్న విషయాలు.
ఈ విషయాలు మౌళి ఒక్కడే కాదు. సినిమాల్లోకి రావాలనుకుంటున్న వాళ్లు...ఇప్పటికే కొనసాగుతున్న నవతరం నటులు కూడా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలి. గణేష్ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు నటుడిగానే కొనసాగాడు. ఇండస్ట్రీలో ఎంతో మందిని చూసాడు. ఎంతో మంది దర్శక, నిర్మాతలు, నటులతో పరిచయా లున్నాయి. స్టార్ హీరోలతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో సడెన్ గా నిర్మాతగా మారి స్టార్ హీరోల టార్గెట్ గా సినిమాలు చేసాడు. కొంత కాలం అక్కడ బాగానే కొనసాగాడు. అటుపై రాజకీయాల్లోకి వెళ్లడం...ఒక్క సారిగా సినిమాలకు దూరమవ్వవడం..నిర్మాతగా ఫాం కోల్పోవడం అన్నీ ఒకేసారి జరిగాయి. ఆ అనుభవాల నేపథ్యంలోనే కొత్త కుర్రాళ్లకు తోచిన విలువైన సూచనలు చేసాడు.
