బండ్ల వారసుడు.. బెల్లంకొండ రికార్డు బ్రేక్ అవుతుందా?
ఒక ప్రొడ్యూసర్ తన కొడుకు ఎంట్రీ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేయగలడో బెల్లంకొండ సురేష్ అప్పట్లో ప్రూవ్ చేశాడు. ఇప్పటివరకు ఏ నిర్మాత కొడుకు కూడా ఆ రేంజ్ గ్రాండ్ లాంచింగ్ రికార్డును బ్రేక్ చేయలేదు.
By: M Prashanth | 10 Aug 2026 7:40 PM ISTటాలీవుడ్ లో నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తే ఆ హడావుడి మామూలుగా ఉండదు. కానీ అలా పరిచయమైన వాళ్లలో అత్యంత భారీ స్థాయిలో లాంచ్ అయిన హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అప్పట్లో అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విధానం మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. ఒక కొత్త కుర్రాడి లాంచింగ్ కోసం ఏకంగా స్టార్ హీరోల మార్కెట్ కి మించి కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి సినిమా ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు.
అప్పటి టాప్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్షన్, సమంత లాంటి స్టార్ హీరోయిన్, తమన్నా స్పెషల్ సాంగ్, అదిరిపోయే యాక్షన్ డోస్.. ఇలా అల్లుడు శీను కోసం చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు. ఒక ప్రొడ్యూసర్ తన కొడుకు ఎంట్రీ కోసం ఏ స్థాయిలో ఖర్చు చేయగలడో బెల్లంకొండ సురేష్ అప్పట్లో ప్రూవ్ చేశాడు. ఇప్పటివరకు ఏ నిర్మాత కొడుకు కూడా ఆ రేంజ్ గ్రాండ్ లాంచింగ్ రికార్డును బ్రేక్ చేయలేదు. కనీసం ఆ స్థాయి బడ్జెట్ దరిదాపుల్లోకి కూడా వేరే వాళ్ళు వెళ్లలేదు.
ఇప్పుడు ఆ పాత రికార్డును బ్రేక్ చేసేలా మరొక స్టార్ నిర్మాత భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ కు సినిమాల మీద ఎంత ప్యాషన్ ఉందో, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలనే కసి ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కొడుకులలో ఒకరిని పెద్ద హీరోని చేస్తానని, మరొకరిని పెద్ద ప్రొడ్యూసర్ చేస్తానని గణేష్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇప్పుడు ఆ ప్లాన్ ని అమలు చేసే పనిలో పడ్డట్లు సినీ వర్గాల్లో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
రీసెంట్ గా బండ్ల గణేష్ కూతురు సంగీత్ ఫంక్షన్ లో కొడుకు బండ్ల హితేష్ చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ టెంపర్ సాంగ్, రామ్ చరణ్ పాటలకు హితేష్ వేసిన స్టెప్స్ చూస్తే పక్కాగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది. బాడీ లాంగ్వేజ్, కష్టమైన స్టెప్స్ లో ఉన్న ఈజ్ చూస్తుంటే హీరో ఎంట్రీకి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్ గానే జరుగుతోందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
గణేష్ రీసెంట్ గా బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేశాడు. బహుశా ఇదే బ్యానర్ పై హితేష్ లాంచింగ్ చాలా గ్రాండ్ గా ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న కాంపిటీషన్ ని తట్టుకుని నిలబడాలంటే నార్మల్ ఎంట్రీ ఇస్తే వర్కౌట్ కాదు. అందుకే బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో ఒక టాప్ డైరెక్టర్, స్టార్ కాస్ట్ తో భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసే ఆలోచనలో గణేష్ ఉన్నట్లు కనిపిస్తోంది.
తమ సొంత బ్యానర్ లో పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసి రికార్డు వసూళ్లు సాధించిన ట్రాక్ రికార్డ్ గణేష్ కు ఉంది. ఆ ఎక్స్ పీరియన్స్ తో ఇప్పుడు కొడుకును జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ రేంజ్ బడ్జెట్ రికార్డును గణేష్ నిజంగానే బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే హితేష్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.
