కుమార్తె ప్రీవెడ్డింగ్ వేడుకలో బండ్ల గణేష్ డ్యాన్సుల ధమాకా
ప్రత్యేకించి పెళ్లికి ముందు సంగీత్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ తన నిబంధనలు, హోదాలను పక్కనపెట్టి ఒక చిన్నపిల్లాడిలా మారిపోయి కుమార్తెతో కలిసి ఆనందంతో డాన్సులు చేశారు.
By: Sivaji Kontham | 10 Aug 2026 10:08 AM ISTటాలీవుడ్ బ్లాక్ బస్టర్ నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్. ఇటీవల తండ్రిగా తన అతిపెద్ద బాధ్యతను అత్యంత వైభవంగా నెరవేర్చే పనిలో ఉన్నారు. గత కొంతకాలంగా సినిమా నిర్మాణానికి కాస్త దూరంగా ఉంటూ తన సొంత వ్యాపారాల్లో ఎంతో బిజీగా గడుపుతున్న ఆయన.. ఇటీవల తన ముద్దుల కుమార్తె జనని బండ్ల నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ వేడుక పెద్ద పండగలా సాగింది.
ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది దిగ్గజాలు, భారీ సంఖ్యలో అతిథులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. బండ్ల గణేష్ అల్లుడు ఎవరు? ఆయన వృత్తి ఏమిటి..? అలాగే బండ్ల గణేష్ నికర ఆస్తుల విలువ ఎంత? తన కుమార్తెకు ఎంత పెద్ద ఎత్తున కానుకలు ఇస్తున్నారు? అనే విషయాలపై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఆయన ఆస్తిపాస్తులు..ఇవ్వబోయే కానుకల కంటే మించి తన కుమార్తెపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమే అసలైన ఆస్తి అని నిరూపించేలా ఒక సంఘటన నిలిచింది. తాజాగా విడుదలైన బండ్ల గణేష్ కుమార్తె సంగీత్ వీడియో ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసునూ గెలుచుకుంటోంది. ఒక తండ్రికి తన కూతురిపై ఉండే నిశ్శబ్దమైన..నిష్కల్మషమైన ప్రేమకు ఈ వీడియో నిలువెత్తు అద్దం పడుతోందని నెటిజన్లు కొనియాడుతున్నారు.
ప్రత్యేకించి పెళ్లికి ముందు సంగీత్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ తన నిబంధనలు, హోదాలను పక్కనపెట్టి ఒక చిన్నపిల్లాడిలా మారిపోయి కుమార్తెతో కలిసి ఆనందంతో డాన్సులు చేశారు. అంతేకాకుండా ఎంతో ఆప్యాయంగా తన కుమార్తె బుగ్గపై ముద్దు పెట్టి.. ఒక తండ్రిగా తనకున్న అమితమైన ప్రేమను , అనుబంధాన్ని ఆవిష్కరించారు. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరూ ``తండ్రీ కూతుళ్ల అనుబంధం అంటే ఇలాగే ఉండాలి`` అంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. సమాజంలో ఒక నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినా.. ఇంట్లో తన కూతురి పట్ల ఒక సగటు ప్రేమగల తండ్రిగా ఆయన ప్రవర్తించిన తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. బండ్ల గణేష్ నిజంగానే `ది గ్రేట్ ఫాదర్` అని అభిమానులు, ప్రేక్షకులు మురిసిపోతున్నారు.
బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల- సూర్య తేజ చిలుకూరిల వివాహం 2026 ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్నజేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. బండ్ల గణేష్ నివాసంలో సాంప్రదాయక పసుపు కుంకుమ కార్యక్రమం .. మే 2026లో జరిగిన నిశ్చితార్థంతో ప్రారంభమైన ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కాగా.. తన తండ్రికి చెందిన `బీజీ బ్లాక్‌బస్టర్స్` బ్యానర్‌లో నిర్మాతగా వ్యవహరిస్తున్న జనని వివాహానికి సంబంధించిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలు సోషల్ మీడియాలో విపరితంగా వైరల్ అవుతున్నాయి.
