కూతురి పెళ్లి కోసం మరో 'మాహిష్మతి' నిర్మించిన బండ్ల గణేష్
నటుడు, ప్రముఖ నిర్మాత బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం చర్చగా మారింది.
By: Sivaji Kontham | 16 Aug 2026 12:45 PM ISTనటుడు, ప్రముఖ నిర్మాత బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం చర్చగా మారింది. ''నేను ఏది చేసినా బ్లాక్ బస్టరే'' అని చెప్పుకునే గణేష్.. తన ఇంట్లోని ఈ శుభకార్యాన్ని కూడా సినీ ఫక్కీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా జరిపిస్తున్నారు. వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రముఖ జేఆర్సీ (JRC) కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కోసం రూపొందించిన ప్రత్యేక కళ్యాణ మంటపం సెట్ అందరినీ ఆకట్టుకుంది. 'బాహుబలి' సినిమాలో మాహిష్మతి నగరాన్ని తలపించేలా రూపుదిద్దుకున్న ఈ భారీ సెట్, వేడుకకు వచ్చిన అతిథులను అబ్బురపరిచింది.
తన ప్రియ పుత్రిక జననిని పల్లకిలో పెళ్లి మండపానికి తీసుకువస్తుంటే బండ్ల గణేష్ ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం అందరి దృష్టినీ ఆకర్షించాయి. జనని- సూర్య తేజల కళ్యాణ వేడుకలో బండ్ల గణేష్ ఒక తండ్రిగా పెద్దగా ఎంతో భావోద్వేగానికి గురవుతూనే.. వచ్చిన ప్రతీ అతిథిని ఆత్మీయంగా ఆహ్వానిస్తూ సందడి చేశారు.
ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యంగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బండ్ల గణేష్ అల్లుడు సూర్య తేజతో బ్రహ్మానందం సరదాగా గడిపిన క్షణాలు.. వారితో వేసిన జోకులు అక్కడ నవ్వుల పువ్వులు పూయించాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక రాజకీయ నాయకులు.. టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ పెళ్లి వేడుక ఒక వైభవమైన పండుగలా మారింది. నూతన దంపతులు జనని, సూర్య తేజల ఫోటోలు, సెలబ్రిటీల సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వేడెక్కిస్తున్నాయి.
