Begin typing your search above and press return to search.

బండ్లన్న వివాదాలన్నీ సమసి పోయినట్లేనా?

పవన్‌ కళ్యాణ్‌ ను దేవుడు అంటూ సంబోధిస్తూ, తన దేవుడు అంటూ బండ్ల గణేష్‌ గతంలో ఇచ్చిన స్పీచ్‌లు చాలానే ఉన్నాయి.

By:  Ramesh Palla   |   24 Aug 2026 2:02 PM IST
బండ్లన్న వివాదాలన్నీ సమసి పోయినట్లేనా?
X

నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు వెలుగు వెలిగిన బండ్ల గణేష్ మధ్యలో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. నిర్మాతగా సినిమాలు చేయడం మానేయడంతో పాటు, పొలిటికల్‌ ఎంట్రీ ఫెయిల్‌ కావడంతో బండ్ల గణేష్‌ ఇక పూర్తిగా కనుమరుగు అయినట్లే అని చాలా మంది భావించారు. కానీ అనూహ్యంగా బండ్ల గణేష్ తిరిగి ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల తన కూతురు వివాహం వైభవంగా చేయడం ద్వారా బండ్ల గణేష్ వార్తల్లో నిలిచాడు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు కావడంతో బండ్ల గణేష్ పేరు మారుమ్రోగింది. బండ్ల గణేష్‌కి ఇంత పలుకుబడి ఉందా అని అంతా ముక్కున వేలేసుకున్నారు. పవర్‌ కళ్యాణ్‌ అనారోగ్య కారణాల వల్ల రాలేక పోయారు. కానీ చిరంజీవి హాజరు అయ్యారు. అంతే కాకుండా పవన్‌ భార్య సైతం పెళ్లికి హాజరు అయ్యారు.

బండ్ల గణేష్‌ కూతురు పెళ్లికి...

బండ్ల గణేష్ కూతురు పెళ్లి వైభవంగా జరగడంతో పాటు, ఆయనకు ఉన్న పేరు, పలుకుబడిని చూపించాయి. వ్యాపారంతో ఇన్నాళ్లు బిజీగా ఉన్న బండ్ల గణేష్ తిరిగి సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. తాజాగా ట్విట్టర్‌లో ఇక నా దృష్టం ఒక్కటే, నా నిర్ణయం ఒక్కటే, నా ప్రయాణం ఒక్కటే.. సినిమా నిర్మాణం అంటూ బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. బండ్ల గణేష్‌ సినిమాల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. ఆయన తన ప్రతి సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావాలనే పట్టుదతలతో నిర్మిస్తూ ఉంటాడు. ఆయన బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌ అయినప్పటికీ బ్లాక్‌ బస్టర్‌ బండ్ల గణేష్ అనే పేరును సొంతం చేసుకున్నాడు. ముందు ముందు కూడా బండ్ల గణేష్ నిర్మాతగా పెద్ద హీరోలతో సినిమాలు తీసి, పెద్ద నిర్మాత అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి.

పవన్‌ కళ్యాణ్‌తో బండ్ల గణేష్ వివాదం...

పవన్‌ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కళ్యాణ్‌ ను దేవుడు అంటూ సంబోధిస్తూ, తన దేవుడు అంటూ బండ్ల గణేష్‌ గతంలో ఇచ్చిన స్పీచ్‌లు చాలానే ఉన్నాయి. అయితే బండ్ల గణేష్‌ ను పవన్‌ కళ్యాణ్‌ దూరం పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఒక సారి బండ్ల గణేష్‌ మాట్లాడుతూ నాకు పవన్‌ కళ్యాణ్ గారికి మధ్య ఒకరు ఉన్నారు. ఆయన వల్లే నేను నా దేవుడిని కలువలేక పోతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తి ప్రముఖ దర్శకుడు అయ్యి ఉంటాడు అనే పుకార్లు సైతం వినిపించాయి. ఆ వివాదాలన్నీ ఇప్పుడు సమసి పోయినట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ కూతురు వివాహంకు పవన్‌ కళ్యాణ్‌ భార్య రావడంతో పాటు, చిరంజీవి ఇంకా మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు హాజరు కావడంతో వివాదం లేనట్లే అని చాలా మంది భావిస్తున్నారు.

టాలీవుడ్‌లో నిర్మాతగా బండ్ల గణేష్‌...

బండ్ల గణేష్‌ ఇండస్ట్రీలో అందరితోనూ సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. మెగా ఫ్యామిలీతో ఆయనకు సన్నిహిత్యం ఎక్కువ, మెగా ఫ్యామిలీ పై భక్తి ఎక్కువ అనే విషయం తెల్సిందే. అందుకే బండ్ల గణేష్ నిర్మాతగా రీ ఎంట్రీ కచ్చితంగా మెగా హీరో మూవీతో ఉండాలని ఆయన సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు. అతి త్వరలోనే బండ్ల గణేష్‌ నిర్మాణంలో సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు బయటి హీరోలతో సినిమాలు నిర్మిస్తూ, తన ఫ్యామిలీ నుంచి కూడా హీరోలను పరిచయం చేయాలని బండ్ల ప్లాన్‌గా తెలుస్తోంది. మొత్తానికి ఇండస్ట్రీలో బండ్ల రీ ఎంట్రీతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్‌, ప్రెస్‌మీట్స్ కి మంచి హైప్‌ వస్తుందని కొందరు సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బండ్ల గణేష్ మైక్‌ అందుకుంటే ఎలా మాట్లాడుతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మాటలను అలాగే వింటూ ఉండి పోతారు. అలాంటి బండ్లన్న మళ్లీ పవన్‌తో సినిమా చేయాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. మరి అది సాధ్యమేనా చూడాలి.