బండ్ల గణేష్, అల్లు అరవింద్ క్రెడిట్ వివాదం.. నిర్మాత ధీరజ్ ఫుల్ క్లారిటీ!
కొంతకాలం క్రితం బండ్ల గణేష్ ఒక సినిమా ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి.
By: M Prashanth | 2 Nov 2025 7:00 PM ISTకొంతకాలం క్రితం బండ్ల గణేష్ ఒక సినిమా ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. "ఎవరో కష్టపడితే, లాస్ట్‌లో క్రెడిట్ మాత్రం అల్లు అరవింద్ గారు పట్టుకుపోతారు" అంటూ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై బేబీ, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ కామెంట్స్ వెనుక ఉన్న అపార్థాన్ని, అరవింద్ గారి వర్కింగ్ స్టైల్‌ను చాలా క్లియర్‌గా వివరించారు.
ఆ రోజు బండ్ల గణేష్ స్టేజ్‌పై ఆ మాటలు అన్నప్పుడు, తర్వాత ఆయన్ను కవర్ చేస్తూ తాము కూడా స్టేజ్‌పై మాట్లాడామని ధీరజ్ గుర్తుచేసుకున్నారు. బండ్ల గణేష్‌కు ఎక్కడి నుంచి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందో, లేక ఆయన ఎందుకు అలా అన్నారో తమకు తెలియదని, కానీ ఆయన అన్న పాయింట్‌లో నిజం లేదని ధీరజ్ స్పష్టం చేశారు. "బండ్ల గణేష్ ఉద్దేశం ఏంటంటే, చేసేది తక్కువైనా క్రెడిట్ అరవింద్ గారికి ఎక్కువ వస్తుందనే పాయింట్ ఆయన అన్నారు. కానీ, ఆయన అబ్జర్వేషన్ వేరు, మా డెసిషన్ వేరు" అని ధీరజ్ అన్నారు.
అల్లు అరవింద్ గారు క్రెడిట్ తీసుకోవడం గురించి ధీరజ్ మాట్లాడుతూ.. "బేబీ సినిమా విషయంలో క్రెడిట్స్ పరంగా అరవింద్ గారు ముందు నుంచీ వద్దనే అనుకున్నారు. అది మ్యూచువల్‌గా తీసుకున్న నిర్ణయం. మారుతి గారు కూడా క్రెడిట్ వద్దనే అన్నారు. ఎందుకంటే మారుతి గారు ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, ఈ క్రెడిట్ వల్ల ఆయనకు కొత్తగా వచ్చేది ఏమీ లేదు" అని వివరించారు.
'బేబీ' ప్రాజెక్ట్ గురించి మరింత లోతుగా వివరిస్తూ, "బేబీ సినిమాను మొదట ఎస్కేఎన్ గారే ఇండివిడ్యువల్‌గా చేద్దామనుకున్నారు. ఆయనే కథను ఎంచుకుని, జర్నీ స్టార్ట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ టైమ్‌లో కూడా అరవింద్ గారు లేరు. ప్రాజెక్ట్ మధ్యలో మా కొలాబరేషన్ జరిగింది. అలా మధ్యలో వచ్చినప్పుడు, 'నాకు కూడా క్రెడిట్ కావాలి' అని అరవింద్ గారి లాంటి స్టేజ్ లో ఉన్నవారు ఎవరూ అడగరు కదా" అని ధీరజ్ లాజికల్‌గా చెప్పారు.
అల్లు అరవింద్ ప్రమేయం గురించి మాట్లాడుతూ, "ఆయన మాకు ఇచ్చే సపోర్ట్ అలాంటిది. ఆయన లేకపోతే నా జర్నీ అసలు ఇక్కడి దాకా వచ్చేదే కాదు. మేము ఏ ఈవెంట్‌కు పిలిచినా, ఆయన రావడానికి ఇష్టపడరు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్.. దేనికైనా మేము బయట సెలబ్రిటీని గెస్ట్‌గా అడిగినట్లే అడగాలి. మొన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్ లాంచ్‌కు కూడా వద్దనే చెప్పారు, ఏదో ఒక ఈవెంట్‌కే వస్తానని అన్నారు" అని ధీరజ్ తెలిపారు.
బండ్ల గణేష్ కామెంట్స్‌ను అరవింద్ గారు సీరియస్‌గా తీసుకోలేదని, ఏవైనా రూమర్స్ వచ్చినా అవన్నీ చదివి నవ్వుకుంటారని ధీరజ్ అన్నారు. "ఆయన మమ్మల్ని తప్పు చేసినప్పుడు తిట్టినా, ఒక అరగంట తర్వాత ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్‌లోకి వెళ్లిపోతారు. అసలు ఇగోయిస్టిక్ కాదు" అంటూ అరవింద్ గారితో తనకున్న అనుబంధాన్ని ధీరజ్ పంచుకున్నారు. మొత్తానికి, క్రెడిట్ వివాదం అనేది కేవలం ఒక అపార్థం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
