మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!
నటుడు బండి సరోజ్ కుమార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో కీలక పాత్ర ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. ఇతర హీరోల సినిమాల్లో సహాయక పాత్రలు చేయకూడదని, సొంత సినిమాలతో హీరోగా ఎదగాలనేది తన లక్ష్యమని చెప్పారు. అయితే కథ నచ్చడంతో సందీప్ రాజ్ దర్శకత్వంలోని 'మోగ్లీ'లో నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం 'ఛప్రి' సినిమాతో బిజీగా ఉన్నారు.
By: M Prashanth | 15 Nov 2026 11:49 AM ISTసినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే చాలామంది వెంటనే ఒప్పుకుంటారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో ఉన్న నటులకు అలాంటి అవకాశాలు బాగా ఉపయోగపడతాయి. కానీ బండి సరోజ్ కుమార్ మాత్రం ఈ విషయంలో కాస్త డిఫరెంట్. తనకు నచ్చిన పాత్రలే చేయాలనుకునే సరోజ్, గతంలో ఓ స్టార్ హీరో సినిమాలో కీలక పాత్రను కూడా వదులుకున్నారట. ఆ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమాలో నటించేందుకు సరోజ్‌కు అవకాశం వచ్చింది. బుచ్చిబాబు స్వయంగా వచ్చి ఓ ముఖ్యమైన పాత్ర చేయాలని అడిగారట. అయితే సరోజ్ మాత్రం ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఇందుకు సరోజ్ ఒక కారణం కూడా చెప్పాడు. తాను ఇతర హీరోల సినిమాల్లో సహాయక పాత్రలు చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
సొంతంగా సినిమాలు తీస్తూ హీరోగా ఎదగాలనేది తన ఆలోచన అని వివరించారు. అందుకే పెద్ద సినిమా అవకాశం వచ్చినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. బండి సరోజ్‌కు దర్శకుడిగా, నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'నిర్బంధం', 'మాంగళ్యం' వంటి సినిమాలను సొంతంగా రూపొందించి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఆ తర్వాత 'పరాక్రమం' సినిమాతో థియేటర్లలోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కథ, దర్శకత్వంతో పాటు నటనలోనూ తనదైన స్టైల్ చూపించాలనేది సరోజ్ ఆలోచన. అయితే సరోజ్ తర్వాత 'మోగ్లీ' సినిమాలో కీలక పాత్ర చేశారు. దర్శకుడు సందీప్ రాజ్ కొన్నేళ్లుగా ఆ కథ గురించి చెబుతున్నారని, మొదట్లో తాను ఒప్పుకోలేదని తెలిపారు. చివరకు కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించారట.
చెప్పిన కథను మార్చకుండా తెరకెక్కించాలనే షరతుతోనే ఆ సినిమా చేసినట్లు వివరించారు. ప్రస్తుతం సరోజ్ 'ఛప్రి' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సందర్భంగా కథ కోసం దాదాపు 700 రోజులు పనిచేసినట్లు చెప్పారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
