Begin typing your search above and press return to search.

పవన్ తో మరో జనసేన నేత మూవీ తీయనున్నారా? నిజమేనా?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది.

By:  M Prashanth   |   11 May 2026 10:38 PM IST
పవన్ తో మరో జనసేన నేత మూవీ తీయనున్నారా? నిజమేనా?
X

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో బిజీ అయిన తర్వాత పవన్ ఇక సినిమాలకు దూరమవుతారని చాలా మంది భావించారు. కానీ ప్రస్తుతం ఆయన లైనప్ చూస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేయడంతో.. అప్ కమింగ్ మూవీలపై నెట్టింట చర్చ నడుస్తోంది.

ఇటీవల విడుదలైన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల తర్వాత పవన్ తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఓజీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో పవన్ సినిమాలు కొనసాగిస్తారని అందరికీ దాదాపు క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు దర్శకుడు సురేందర్ రెడ్డితో కూడా కొత్త సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యారు.

ఆ తర్వాత మరిన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు రాగా.. పవన్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం పవన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, అప్ కమింగ్ ప్రాజెక్టులపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి వార్తలు నమ్మొద్దని సూచించింది. దీంతో ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమానే పవన్ తదుపరి ప్రాజెక్ట్ గా తెలుస్తోంది.

ఆ సినిమాను రామ్ తాళ్లూరి తన ఎస్‌ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో కూడా ఆయన చురుకుగా వర్క్ చేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకత్వం, సినిమా నిర్మాణం రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్తున్న నేతగా ఆయన పేరు ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే క్రమంలో మరో జనసేన నేత పేరు తెరపైకి వచ్చింది.

మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్‌ తో సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. పవన్ ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తే అప్పుడు తాను సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని ఆయన చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బాలినేని వ్యాఖ్యలు సాధారణంగా చేసినవేనా? లేక నిజంగానే పవన్‌ తో సినిమా ప్లాన్ చేస్తున్నారా? అన్నదానిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

పవన్‌ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనతో సినిమా తీయాలని అనుకోవడం సహజమే అయినా, రాజకీయ నాయకుడే ఇలా ఓపెన్‌ గా చెప్పడం ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ ముందుగా సురేందర్ రెడ్డి సినిమా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ఓజీ 2 లైన్ లో ఉంది. రాజకీయ బాధ్యతలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సినిమాలకు సమయం కేటాయించడం అంత ఈజీ కాదు. అందుకే బాలినేని వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకే పరిమితమయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన వస్తే మాత్రం మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదని సినీ ప్రియులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.