Begin typing your search above and press return to search.

బాలయ్య 'డబుల్' ఫెస్టివల్ ప్లాన్!

నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి డబుల్ ట్రీట్‌ కు రెడీ అవుతున్నట్టు టాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   11 Feb 2026 10:49 PM IST
బాలయ్య డబుల్ ఫెస్టివల్ ప్లాన్!
X

నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి డబుల్ ట్రీట్‌ కు రెడీ అవుతున్నట్టు టాలీవుడ్‌ లో టాక్ వినిపిస్తోంది. తక్కువ గ్యాప్ లోనే రెండు బడా సినిమాలతో అభిమానులను అలరించేలా ప్లాన్ రెడీ అవుతుందని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుండగా.. రిలీజ్ ప్లాన్‌ లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొదట ఆ సినిమాను 2027 సంక్రాంతి బరిలో దించాలని భావించారు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్లాన్ మార్చి.. ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పండుగ సీజన్‌ లో మాస్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు బాలయ్య యాక్షన్ ఎంటర్టైనర్లకు దసరా సీజన్ సరిగ్గా సరిపోతుందనే అభిప్రాయంతో ఆ నిర్ణయం తీసుకున్నారని టాక్.

దీంతో సినిమా షూటింగ్ షెడ్యూల్‌ ను చేంజ్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను ప్యారలల్ గా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే గోపీచంద్ మలినేని– బాలయ్య కాంబినేషన్‌ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరి కలయికలో వచ్చిన వీర సింహా రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో.. కొత్త ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మాస్ డైలాగులు, పవర్‌ ఫుల్ యాక్షన్ సీన్స్, బాలయ్య మార్క్ ఎంటర్టైన్మెంట్ మలినేని మూవీలో ఉండబోతున్నాయని వినికిడి.

అదే సమయంలో బాలయ్య 2027 సంక్రాంతి కూడా వదులుకోవడం లేదని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాను పొంగల్ కానుకగా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించనున్న ఆ ప్రాజెక్ట్ త్వరలో అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కంప్లీట్ అయ్యాక హరీష్ శంకర్.. బాలయ్య ప్రాజెక్ట్‌ పై దృష్టి పెట్టనున్నారట. సంక్రాంతి సీజన్ అంటే నాగవంశీకి మంచి సెంటిమెంట్. ఆయన నిర్మించిన పలు చిత్రాలు ఆ సమయంలో మంచి విజయాలు సాధించాయి. అందుకే 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ ఎంటర్టైనర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్‌ కు వరుస పండుగలే అన్నమాట. ఈ ఏడాది దసరాకు ఒక సినిమా, ఆ తర్వాత సంక్రాంతికి మరో మూవీ రిలీజ్ అయితే.. అభిమానులకు డబుల్ ఎంజాయ్మెంట్ ఖాయం. అఫీషియల్ అనౌన్స్మెంట్లు త్వరలో రానున్నప్పటికీ.. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న అప్డేట్స్ తో నందమూరి అభిమానుల్లో జోష్ డబుల్ అయింది. బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తారని అంతా ఫిక్స్ అయిపోయారు!