Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : బాలన్

బాధతో కావచ్చు.. సంతోషంతో కావచ్చు.. సినిమాలో ఏదో ఒక దశలో కళ్లలో నీళ్లు తిరగడం మాత్రం ఖాయం. అంతగా బలమైన ముద్ర వేసే సినిమా.. బాలన్.

By:  Prakash Chimmala   |   19 Jun 2026 8:16 PM IST
మూవీ రివ్యూ : బాలన్
X

‘బాలన్’ మూవీ రివ్యూ

నటీనటులు: ఫర్జానా పలతింగల్ - ఆదిశేషన్ - జినన్ - టొవినో థామస్ తదితరులు

సంగీతం: సుశిన్ శ్యామ్

ఛాయాగ్రహణం: షైజు ఖాలిద్

నిర్మాతలు: వెంకట నారాయణ - శైలజ దేశాయ్

రచన: జీతు మాధవన్

దర్శకత్వం: చిదంబరం

సినిమాల్లో సెంటిమెంట్ పండాలంటే ఏం చేయాలి..? ప్రధాన పాత్రలు ఎక్కడలేని కష్టాలు పడుతున్నట్లు చూపించాలి.. ఆ క్యారెక్టర్లు కన్నీరు మున్నీరైపోవాలి.. ఆ పాత్రల్ని హింసించడానికి కొన్ని దుర్మార్గమైన పాత్రలను డిజైన్ చేయాలి.. విపరీతమైన మెలోడ్రామాతో సన్నివేశాలను నింపేయాలి.. సెంటిమెంట్ డైలాగులు పెట్టాలి.. వీటన్నింటికీ తోడు బ్యాగ్రౌండ్లో గుండెల్ని పిండేసేలా బీజీఎం ప్లే చేయించాలి. కానీ వీటిలో ఏవీ లేకుండా కూడా ప్రేక్షకుల గుండెల్ని మెలిపెట్టవచ్చు.. కన్నీళ్లు పెట్టుకునేలా చేయొచ్చు. సెంటిమెంటు సీన్లంటే పారిపోయే ఆడియన్సుని సైతం కదిలించవచ్చు. అదెలాగో తెలియాలంటే.. ‘బాలన్’ సినిమా చూడాలి. ట్రైలర్ చూస్తే ఇదేదో మలయాళం మార్కు థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తుంది కానీ.. నిజానికిది తల్లికొడుకుల బంధం నేపథ్యంలో సాగే హృద్యమైన ఎమోషనల్ డ్రామా. అలా అని ఇందులో పనిగట్టుకుని సెంటిమెంట్ ఏమీ దట్టించేయలేదు. కథలో థ్రిల్లర్ అంశాలు తక్కువే అయినా.. నరేషన్ మాత్రం ఆ జానర్ చిత్రాల తరహాలోనే భిన్నంగా నడుస్తుంటుంది. ప్రధాన పాత్రల చిత్రణే చాలా మర్మంగా ఉంటూ.. సన్నివేశాలన్నీ కొత్తగా సాగుతూ ప్రేక్షకులను ఆద్యంతం గెస్సింగ్ లో ఉంచుతాయి. కానీ ఇందులో యూఎస్పీ మాత్రం తల్లి-కొడుకు బంధం నేపథ్యంలో భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లే సీన్లే. బాధతో కావచ్చు.. సంతోషంతో కావచ్చు.. సినిమాలో ఏదో ఒక దశలో కళ్లలో నీళ్లు తిరగడం మాత్రం ఖాయం. అంతగా బలమైన ముద్ర వేసే సినిమా.. బాలన్.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన మాలీవుడ్లో.. ఈ మధ్య ఆ జానర్ సినిమాలన్నీ ఒక మూసగా మారిపోయి ప్రేక్షకులకు మొహం మొత్తేస్తున్న సమయంలో ‘బాలన్’ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక రిఫ్రెషింగ్ మూవీ. రోమాంచం.. ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ తన రచనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తే.. ‘మంజుమ్మల్ బాయ్స్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిదంబరం వైవిధ్యమైన టేకింగ్ తో ‘బాలన్’ను ఒక ప్రత్యేకమైన చిత్రంగా తీర్చిదిద్దాడు. ఒక లైన్లో చెప్పుకుంటే ‘బాలన్’ అంత విశేషమైన కథేమీ కాదు. భర్తను కోల్పోయి కొడుకుతో కలిసి ఒంటరిగా జీవించే ఒక మహిళ.. తమ అస్థిత్వం కోసం చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ క్రమంలో ఆ తల్లి కొడుకుల మధ్య ఎడబాటు ఎందుకు వచ్చింది.. తిరిగి ఆ ఇద్దరూ కలిశారా లేదా అన్నదే ఈ సినిమాకు ముగింపు. ఇలా రెండు లైన్లలో చెప్పుకుంటే ఏముంది ఈ కథలో అనిపిస్తుంది. పైగా ఇలా ఒంటరి మహిళ కష్టాలు.. తల్లీ కొడుకుల బంధం అనగానే ఇదేదో సీరియల్ టైపు సినిమాలా సాగుతుందేమో అన్న భయం కూడా కలగొచ్చు. కానీ కొత్తగా.. క్రేజీగా సాగే సినిమాలు చూడాాలనుకునే యువ ప్రేక్షకులే ఈ సినిమాకు ఎక్కువ కనెక్ట్ అవడమే దీని ప్రత్యేకత. ఈ చిత్రానికి ఆ ప్రత్యేకత రావడానికి కారణం.. ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా సాగే పాత్రల చిత్రణ.. సన్నివేశాలే.

తనకు కొడుక్కి మధ్య ఇంకెవ్వరూ రాకూడదని. తమకు ఇంకే రకమైన బంధమూ ఉండకూడదని ఇందులో ప్రధాన పాత్ర కోరుకోవడానికి.. తమ ఐడెంటిటీని దాచిపెట్టడానికి బలమైన కారణం చూపించలేదు కానీ.. చిత్రంగా సాగే ఆ పాత్ర తీరు వల్లే ఈ సినిమాకు ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇక ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ.. పాత్రకు తగ్గట్లుగా అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనపడే పిల్లాడి పాత్ర ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణ. ఒక దశలో ఆ పిల్లాడి పరిస్థితిని చూస్తే అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేస్తాయి. తనతో ముడిపడ్డ సన్నివేశాలు అంత హృద్యంగా సాగితే.. ఆ పాత్రలో పిల్లాడి హావభావాలు కూడా అంతగా గుచ్చుకుంటాయి. ఐతే ప్రథమార్ధం అంతా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తిస్తూ.. భిన్నమైన సన్నివేశాలతో సాగే ‘బాలన్’.. ద్వితీయార్ధంలో మాత్రం కొంచెం గాడి తప్పుతుంది. తల్లి కొడుకు విడిపోయాక కథనంలో తలెత్తే గందరగోళం.. కొన్ని అనవసర సన్నివేశాల వల్ల ‘బాలన్’ బోర్ కొట్టిస్తుంది కూడా. కానీ పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్టు.. ఈ కథను ముగించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచడమే కాక సంతృప్తినీ కలిగిస్తాయి. ఆఖర్లో కడుపు నిండిన భావనతో ఆడియన్స్ బయటికి వస్తారు.

మలయాళ రచయితలు.. దర్శకులు తమను ఎప్పటికప్పుడు ఎలా కొత్తగా ఆవిష్కరించుకుంటారో.. రాతలో-తీతలో ఎంత భిన్నమైన ఆలోచనలు చేస్తారో చెప్పడానికి ‘బాలన్’ తాజా ఉదాహరణ. రచయిత జీతు మాధవన్.. దర్శకుడు చిదంబరం ఇద్దరి పనితనానికి వీరతాళ్లు వేయొచ్చు. ఇక ప్రధాన పాత్రధారి ఫర్జానా చాలా బాగా నటించింది. కానీ ఆమెను మించి మార్కులు వేర్వేరు వయసుల్లో తన కొడుకు పాత్రను పోషించిన మాస్టర్ ఆదిశేషన్.. మాస్టర్ జినన్ లకు పడతాయి. ఇద్దరూ ప్రేక్షకులను కదిలించేలా అద్భుతంగా హావభావాలను పలికించారు. అతిథి పాత్రలో టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి ఇందులో ఒక షాకింగ్ క్యారెక్టర్.. లుక్ తో అతను ఆశ్చర్యపరిచాడు. మిగతా నటీనటులంతా కూడా బాగా చేశారు. సాంకేితకంగా కూడా ‘బాలన్’ మెప్పిస్తుంది. ఒక వైవిధ్యమైన సినిమా చూడాలనుకునే ‘బాలన్’కు కచ్చితంగా ఒక మంచి ఛాయిస్ అనడంలో సందేహం లేదు.

చివరగా: బాలన్.. కదిలించే కుర్రాడు

రేటింగ్ - 3/5