మరో మలయాళ సినిమా వెంట తెలుగు ప్రేక్షకుల పరుగులు...!
తెలుగు ప్రేక్షకుల్లో కొంత మందిలో మలయాళ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు ఉంటారు. వారు ఏ మలయాళ సినిమా వచ్చినా చూసేందుకు రెడీగా ఉంటారు.
By: Ramesh Palla | 3 Aug 2026 1:19 PM ISTమలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయనే అభిప్రాయం సుదీర్ఘ కాలంగా ఉంది. కొందరు మలయాళ సినిమాలను ఒకప్పుడు బూతు సినిమాలు అంటూ ఉండేవారు. బూతు సినిమాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది ఒక మలయాళ సినిమా తరహాలో ఉంటుంది అన్నట్లుగా చాలా కాలం వరకు మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మలయాళ సినిమా ఇండస్ట్రీ వైపు మొత్తం దేశం చూస్తుంది అనడంలో సందేహం లేదు. మలయాళ సినిమాలో ఉండే సబ్జెక్ట్ గుండెలను పిండేసేది, ఆలోచన కలిగించేది అన్నట్లుగా ఉంటుంది అని ఎన్నో సినిమాలు నిరూపించాయి. చాలా మంది ఫిల్మ్ మేకర్స్, ముఖ్యంగా నిర్మాతలు మలయాళ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడం మనం చూస్తూనే ఉన్నాం. మలయాళంలో వస్తున్న సినిమాలు ఒక వర్గం వారిని ఎప్పుడూ నిరాశ పర్చలేదు అనే అభిప్రాయం ఉంది.
మలయాళ మూవీ బాలన్ రిలీజ్...
తెలుగు ప్రేక్షకుల్లో కొంత మందిలో మలయాళ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు ఉంటారు. వారు ఏ మలయాళ సినిమా వచ్చినా చూసేందుకు రెడీగా ఉంటారు. అలాంటి వారు అంతా ఇప్పుడు బాలన్ ది బాయ్ అనే సినిమా వైపు చూస్తున్నారు. మలయాళంలో రూపొంది బాలన్ మూవీ జూన్ 19, 2026న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సమయంలో పెద్దగా చర్చ జరగలేదు. విడుదలైన తర్వాత సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలైంది. దాంతో పెద్దగా పబ్లిసిటీ చేయకుండానే రూ.30 కోట్లకు మించి వసూళ్లు సాధించింది. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను కేవలం రూ.18 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఓటీటీ డబ్బింగ్ రైట్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడిందని, దాంతో నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న బాలన్ సినిమాకు...
ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా మలయాళం సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో తెగ చూస్తున్నారు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న బాలన్ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీ5 లో తెలుగు ప్రేక్షకులు అత్యధికంగా చూస్తున్న సినిమాగా బాలన్ నిలిచిందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోంది. ఒక చిన్న కథ, సింపుల్ స్క్రీన్ ప్లే, తల్లి కొడుకు మధ్య ఉండే అనుబంధం, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ ఇలా అన్ని కూడా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి అనడంలో సందేహం లేదు. కథలో చిన్న చిన్న ట్విస్ట్‌లు తప్ప పెద్ద హంగామా లేదు. అయినా కూడా ప్రేక్షకులు సినిమాను తెగ చూడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి బాలన్ సినిమాకు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం దక్కింది. దాంతో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా వైపు పరుగులు తీస్తున్నారు.
టోవినో థామస్ ముఖ్య పాత్రలో నటించిన...
జైలు నుంచి కొడుకుతో ఒక తల్లి బయటకు రావడంతో కథ మొదలవుతుంది. ఆ తల్లి, కొడుకుతో కలిసి ఎలా జీవితాన్ని సాగించింది, తల్లి కొడుకు విడిపోయి మళ్లీ ఎలా కలిశారు అనేది కథాంశం. ఈ సినిమాలో తల్లి పాత్రలో నటించిన నటి, బాలన్ పాత్రలో నటించిన కుర్రాడు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతారు అనడంలో సందేహం లేదు. నటిగా ఆమె మెప్పించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆమె యాక్టింగ్, లుక్స్ ఏమాత్రం మారకుండా బ్యాలన్స్ చేస్తూ వచ్చింది. సినిమాలో యంగ్ మలయాళ హీరో టోవినో థామస్ ముఖ్య పాత్రలో నటించాడు. అంతటి పెద్ద హీరోను ఈ సినిమాలోని ఆ చిన్న పాత్రకు, అది కూడా ఒక దొంగ పాత్రకు ఒప్పించడం అనేది గొప్ప విషయం. ఆయనకు సినిమాపై ఉన్న నమ్మకంతో నటించి ఉంటాడు. ఆయన ప్రజెన్స్‌తో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. మొత్తానికి మలయాళ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఒక మంచి సినిమా బాలన్ అనడంలో సందేహం లేదు. అందుకే బాలన్ వెంట తెలుగు ప్రేక్షకులు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు.
