బాలకృష్ణ మూవీలో స్వింగ్ జరా సర్‌ప్రైజ్...!
అఖండ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు.
By: Ramesh Palla | 24 Nov 2025 4:18 PM ISTనందమూరి బాలకృష్ణ గత రెండు మూడు సంవత్సరాలుగా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన నుంచి వచ్చిన సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది అని అభిమానులు చాలా ఆనందంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ గత చిత్రం డాకు మహారాజ్ కి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో ఉన్న పరిస్థితుల కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు చేయలేక పోయింది. కానీ 2025 కి మంచి స్టార్టింగ్‌ను డాకు మహారాజ్ ఇచ్చిందని, కచ్చితంగా ఫ్యాన్స్ మూవీ అంటూ ఆ సినిమా గురించి రిపోర్ట్ వచ్చింది. 2025లోనే అఖండ 2 సినిమాతో బాలకృష్ణ రాబోతున్నాడు. అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన డాకు మహారాజ్ సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన విషయం తెల్సిందే.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ...
మరో వైపు బాలకృష్ణ తన తదుపరి సినిమాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. అఖండ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇటీవల సినిమా గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలకృష్ణను జనాలు ఎలాగైతే చూడాలి అనుకుంటారో గోపీచంద్ మలినేని అలాగే చూపిస్తాడు అనే నమ్మకం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఒక పీరియాడిక్ మూవీ అని, చారిత్రాత్మక మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఆ విషయమై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.
బాలకృష్ణ అఖండ 2 సినిమా రిలీజ్...
ఇటీవలే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న సినిమాలో నయనతార రాణి పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రకటన వచ్చింది. బాలకృష్ణతో మరోసారి నయనతార సినిమా చేసేందుకు సైన్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా కోసం తమన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. బాలయ్య సినిమాలో మాస్ ఆడియన్స్ కోసం ఐటెం సాంగ్‌ను పెట్టడం చాలా కామన్ విషయం. ఇప్పుడు బాలయ్య, గోపీచంద్ కాంబో మూవీలో వచ్చే ఐటెం సాంగ్ లో తమన్నాను నటింపజేసే విధంగా చర్చలు నడుస్తున్నాయట. ఈ మధ్య కాలంలో తమన్నా ఐటెం సాంగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆమె నర్తించిన ఐటెం సాంగ్స్ ఉన్న సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే బాలయ్య 111 సినిమాలో ఐటెం సాంగ్‌కు ఆమెను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
తమన్నా ఐటెం సాంగ్ కి ఓకే
గతంలో ఎన్టీఆర్ మూవీ జై లవకుశ లో స్వింగ్ జరా అంటూ తమన్నా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ మధ్య జైలర్ సినిమాలో ఈమె కావాలా అంటూ చేసిన డాన్స్ ను ఇంకా కూడా ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా స్త్రీ 2, అరణ్మయి 4, అల్లుడు శ్రీను, కేజీఎఫ్ ఇలా పలు సినిమాల్లో తమన్నా ఐటెం సాంగ్ చాలా స్పెషల్‌గా నిలిచింది. ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉన్న తమన్నా ఇప్పటి వరకు బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సీనియర్ హీరోలు అందరితో సినిమాలు చేసిన ఈమె ఇప్పుడు మొదటి సారి బాలకృష్ణతో స్టెప్స్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థం ఆరంభంలోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. బాలకృష్ణ, నయనతార హిట్ కాంబోగా పేరుంది, ఇక తమన్నా ఐటెం సాంగ్ తో మాస్ కి పిచ్చెక్కడం ఖాయం, గోపీచంద్ మలినేని వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నాడు. కనుక బాలయ్య 111 సినిమా హిట్ ఖాయం అని అభిమానులు ధీమాతో ఉన్నారు.
