హ్యాపీ బర్తడే బాలయ్య.. ఖాతాలో ఆశ్చర్యపరిచే ఆస్తులు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే 'నటసింహం' నందమూరి బాలకృష్ణ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
By: Madhu Reddy | 10 Jun 2026 2:51 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే 'నటసింహం' నందమూరి బాలకృష్ణ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఐదు దశాబ్దాలుగా వెండితెరపై రారాజులా వెలుగుతున్న బాలయ్య.. నేటికీ అదే జోష్‌తో, కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారు. ‘అఖండ’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బాలయ్య, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తులు, రాబోయే సినిమాల గురించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
ఐదు దశాబ్దాల నట ప్రస్థానం:
బాలకృష్ణ 1974లో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వచ్చిన 'తాతమ్మ కల' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ యాభై ఏళ్ల ప్రయాణంలో ఆయన దాదాపు 110 సినిమాల్లో నటించారు. ఇక విమర్శకులు ఎప్పుడు బాలయ్య పని అయిపోయింది అనుకున్నా, ప్రతిసారీ ఒక మైండ్ బ్లోయింగ్ మాస్ కంబ్యాక్ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద విమర్శకుల నోళ్లు మూయించడం ఆయనకు మాత్రమే సాధ్యం.
రెట్టింపైన పారితోషికం:
ఒకప్పుడు బాలకృష్ణ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు పారితోషికం తీసుకునేవారు. కానీ, ఈ మధ్యకాలంలో ఆయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.ఇక దాంతో బాలయ్య తన రేంజ్‌కు తగ్గట్టుగా పారితోషికాన్ని కూడా భారీగా పెంచేశారు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు రూ. 20 నుండి రూ. 30 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
మైండ్ బ్లాక్ చేసే బాలయ్య ఆస్తులు:
హీరోగానే కాకుండా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్న బాలకృష్ణ ఆస్తుల విలువ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఏరియాలో ఉన్న ఆయన సొంత ఇంటి విలువనే దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. ఇక దీనితో పాటు ఆయనకు ఎన్నో ప్రాంతాల్లో విలువైన భూములు, ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. అలాగే ప్రముఖ రామకృష్ణ స్టూడియో, ఎన్టీఆర్ స్టూడియోలలో కూడా ఆయనకు భారీగానే భాగస్వామ్యం ఉంది.
కిలోల కొద్దీ బంగారం.. లగ్జరీ కార్లు:
బాలయ్య దగ్గర ఉన్న బంగారం, వెండి లెక్కలు చూస్తే కళ్లు చెదరడం ఖాయం. ఆయనకు దాదాపు 6 కిలోల బంగారం, 156 కిలోల వెండి, అలాగే 580 క్యారెట్ల విలువైన వజ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కార్ల విషయానికి వస్తే.. ఆయన గ్యారేజీలో బిఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ వంటి ఎన్నో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక మొత్తంగా బాలకృష్ణ కుటుంబ ఆస్తుల విలువ దాదాపు రూ. 280 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
లైన్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు:
ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ సీనియర్ హీరో. ఆయన చేతిలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. 'వీరసింహారెడ్డి' తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై బ్యాక్‌డ్రాప్‌లో 'NBK 111' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనితో పాటు కొరటాల శివ దర్శకత్వంలో 'NBK 112' ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ అయింది. అలాగే దిల్ రాజు నిర్మాణంలో, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట డైరెక్షన్‌లో ఒక సినిమాతో పాటు, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జై అఖండ’ (అఖండ 3) కూడా లైన్‌లో ఉంది.
వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, 60 దాటినా కూడా వెండితెరపై సింహంలా గర్జిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు చూసుకుంటూనే, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకు సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ బొనాంజా బాలయ్య బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.
