Begin typing your search above and press return to search.

మాస్ ఎలివేషన్స్ vs ఫ్యామిలీ ఎమోషన్స్.. ఈ దసరా విజేత ఎవరు?

తెలుగు సినీ పరిశ్రమలో దసరా సీజన్‌కు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్, సెలవులు, భారీ థియేట్రికల్ మార్కెట్ కలిసి ఈ పండగను నిర్మాతలకు బంగారు అవకాశంగా మారుస్తాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 Jun 2026 6:43 PM IST
మాస్ ఎలివేషన్స్ vs ఫ్యామిలీ ఎమోషన్స్.. ఈ దసరా విజేత ఎవరు?
X

తెలుగు సినీ పరిశ్రమలో దసరా సీజన్‌కు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఫ్యామిలీ ఆడియ‌న్స్, సెలవులు, భారీ థియేట్రికల్ మార్కెట్ కలిసి ఈ పండగను నిర్మాతలకు బంగారు అవకాశంగా మారుస్తాయి. ఈ ఏడాది కూడా దసరా బాక్సాఫీస్ ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్, మరోవైపు వెంకటేష్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం దాదాపు ఒకే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయ‌నే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినా, అక్టోబర్ 16 దసరా టార్గెట్ గా రెండు సినిమాల ప్లాన్స్ ఉన్నాయనే ప్రచారం ట్రేడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఈ క్లాష్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం మాస్ వర్సెస్ క్లాస్ పోటీ. బాలకృష్ణ సినిమా పూర్తిస్థాయి యాక్షన్, ఎలివేషన్లు, మాస్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, వెంకటేష్- త్రివిక్రమ్ సినిమా ఫ్యామిలీ స్టోరీ, ఎంట‌ర్టైన్మెంట్, ఎమోష‌న్స్, క్రైమ్ అంశాల మేళవింపుగా ఉండబోతుందనే టాక్ ఉంది. అందుకే ఈ పోటీ కేవలం ఇద్దరు హీరోల మధ్య కాకుండా రెండు భిన్నమైన సినీ శైలుల మధ్య పోరుగా కూడా కనిపిస్తోంది. మరోవైపు త్రివిక్రమ్‌కు ఆదర్శ కుటుంబం చాలా కీలక ప్రాజెక్ట్‌గా మారింది. తదుపరి ప్లాన్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాకు మార్కెట్, బిజినెస్ పరంగా ఈ సినిమా ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉంది. వెంకటేష్ ను తొలిసారి డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్ ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొల్పారు.

ఇక బాలయ్య విషయానికి వస్తే, దసరా సీజన్ ఆయనకు మంచి సెంటిమెంట్‌ను అందించింది. గతంలో రిలీజైన భగవంత్ కేసరి ద‌స‌రా టైమ్ లోనే రిలీజై మంచి పోటీని త‌ట్టుకుని హిట్ గా నిల‌దొక్కుకుంది. మంచి క‌లెక్ష‌న్స్ తో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అందుకే ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ‌య్యే టీజ‌ర్ లో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే దసరా బాక్సాఫీస్ సమీకరణాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

బాలయ్య- వెంకటేష్ మధ్య పోటీ కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇద్దరి సినిమాలు పలు సందర్భాల్లో ఒకే సీజన్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీని సృష్టించాయి. అయితే ఈసారి పరిస్థితి మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరూ తమ కెరీర్‌లో కీలక దశలో ఉన్న సినిమాలతో వస్తున్నారు. దీంతో థియేటర్ల కేటాయింపు, స్క్రీన్ కౌంట్, డిస్ట్రిబ్యూషన్ వ్యూహాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ఒకవేళ రెండు సినిమాలూ నిజంగానే దసరా బరిలో నిలిస్తే, ట్రేడ్ వర్గాలు మాత్రమే కాకుండా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూసే పోరుగా ఇది మారనుంది. చివరికి మాస్ ఎంటర్‌టైనర్ పైచేయి సాధిస్తుందా, లేక ఫ్యామిలీ క్లాస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల మనసు గెలుస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం దసరా 2026 బాక్సాఫీస్ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందనే చెప్పాలి.