Begin typing your search above and press return to search.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ కొత్త సీజన్ సంగతి ఏంటి?

నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్‌ చూపించిన టాక్‌ షో అన్‌స్టాపబుల్‌. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన ఈ టాక్‌ షో ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది.

By:  Ramesh Palla   |   1 Oct 2026 7:00 PM IST
బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ కొత్త సీజన్ సంగతి ఏంటి?
X

నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్‌ చూపించిన టాక్‌ షో అన్‌స్టాపబుల్‌. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన ఈ టాక్‌ షో ఇప్పటి వరకు నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకుంది. నాలుగు సీజన్లలో మొత్తం 35 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్‌ అయ్యాయి. చివరిదైన నాల్గవ సీజన్‌ 2024 అక్టోబర్‌ 25న ప్రారంభం అయ్యి 2025 జనవరి వరకు సాగింది. నాల్గవ సీజన్‌ వచ్చి రెండు ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఐదో సీజన్ ఊసే లేకపోవడంతో నందమూరి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజన్‌ 4 ను బాలకృష్ణ చివరి సీజన్‌గా ప్రకటించలేదు. కనుక ఆహా నుంచి మరిన్ని అన్‌స్టాపబుల్‌ సీజన్‌లు వస్తాయని అంతా భావిస్తున్నారు. కానీ ఐదవ సీజన్‌ విషయమై చాలా ఆలస్యం అవుతోంది. బాలకృష్ణ ఎమ్మెల్యే గా బిజీగా ఉండటంతో పాటు, సినిమాల కారణంగా ఈ షో ఆలస్యం అవుతుందా అనే చర్చ సైతం జరుగుతోంది.

బాలకృష్ణ దాదా సినిమాతో రెడీ...

ప్రస్తుతం బాలకృష్ణ 'దాదా' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలకృష్ణ ఈ సినిమా కోసం ఒక యాక్షన్‌ సీక్వెన్స్ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఎడమ కాలుకు తీవ్రమైన గాయం అయింది. దాంతో బాలకృష్ణ సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో దసరాకు విడుదల కావాల్సిన దాదా సినిమా క్రిస్మస్‌ కు షిప్ట్‌ అయింది. అంతే కాకుండా అన్‌స్టాపబుల్‌ సైతం ఆ గాయం వల్ల కాస్త ఆలస్యం అయ్యి ఉంటుందని కొందరు అంటున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్‌ కి బాలకృష్ణ హాజరు అవుతున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ దాదా సినిమా షూటింగ్‌ పూర్తి చేయడం కోసం రెడీ అయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్‌కు రెడీ కానీ అన్‌స్టాపబుల్‌ షో ఇప్పట్లో లేనట్లే అనే వార్తలు వస్తున్నాయి.

చిరంజీవి నెట్‌ఫ్లిక్స్‌లో టాక్‌ షో...

ఈమధ్య కాలంలో మెగాస్టార్‌ చిరంజీవి టాక్‌ షో గురించిన ప్రచారం జోరుగా సాగుతోంది. సుస్మిత కొణిదెల స్వయంగా నిర్మించబోతున్న టాక్‌ షో తో చిరంజీవి నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందాలు సైతం జరిగినట్లు చెబుతున్నారు. 2027 సంక్రాంతి సందర్భంగా చిరంజీవి టాక్‌ షో మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. దాంతో బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో గురించి మళ్లీ చర్చ మొదలు అయింది. సీజన్‌ 5 ఎప్పుడు అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆహా వారిని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా బాలకృష్ణ అభిమానులు సైతం చాలా మంది నందమూరి ఫ్యామిలీకి చెందిన వారిని, బాలకృష్ణకు సన్నిహితంగా ఉండే వారిని అడుగుతున్నారు. ఏ ఒక్కరి నుంచి సరైన సమాధానం మాత్రం రావడం లేదు.

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో...

ఇప్పటికే నాలుగు సీజన్‌లు పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్‌ కచ్చితంగా ఐదవ సీజన్ ఉంటుంది. ఈ షో కు సరైన ముగింపు అనేది ఇవ్వకుండా బాలకృష్ణ షో ను వదులుకోడు. కనుక కచ్చితంగా కొత్త సీజన్‌ ఉంటుందని, అది ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలకృష్ణ ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఏ స్టార్‌ హీరో కూడా ఇంత స్పీడ్‌గా సినిమాలు చేయడం లేదు అనేది వాస్తవం. సినిమాలపై అంతగా దృష్టి పెట్టిన బాలకృష్ణ త్వరలోనే అన్‌స్టాపబుల్‌ పై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆహా లో మళ్లీ బాలయ్యను అన్‌స్టాపబుల్‌ అంటుండగా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదా సినిమా ప్రమోషన్‌ సమయంలో ఏమైనా బాలకృష్ణ తన అన్‌స్టాపబుల్‌ టాక్‌ షో గురించి చెప్తాడా అనేది చూడాలి.