Begin typing your search above and press return to search.

భావిత‌రాలు సినిమా ద్వారా స‌నాత‌నాన్ని తెలుసుకుంటారు: ఎన్బీకే

స‌నాత‌న ధ‌ర్మం అంటే స‌త్యాన్ని మాట్లాడ‌టం.. ధ‌ర్మాన్ని అనుస‌రించ‌డం.. సినిమా అనే శ‌క్తివంత‌మైన మీడియా ద్వారా అంద‌రికీ దీనిని తెలియ‌జేస్తున్నామ‌ని అన్నారు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌.

By:  Sivaji Kontham   |   4 Dec 2025 8:53 AM IST
భావిత‌రాలు సినిమా ద్వారా స‌నాత‌నాన్ని తెలుసుకుంటారు: ఎన్బీకే
X

స‌నాత‌న ధ‌ర్మం అంటే స‌త్యాన్ని మాట్లాడ‌టం.. ధ‌ర్మాన్ని అనుస‌రించ‌డం.. సినిమా అనే శ‌క్తివంత‌మైన మీడియా ద్వారా అంద‌రికీ దీనిని తెలియ‌జేస్తున్నామ‌ని అన్నారు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన అఖండ 2- తాండ‌వం డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఈ సినిమాకి హైద‌రాబాద్ స‌హా చెన్నై, ముంబైలో బాల‌య్య టీమ్ అద్భుత‌మైన ప్ర‌మోష‌న్స్ చేసారు.

ఈ బుధ‌వారం నాడు చెన్నైలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఎన్బీకే స్ఫూర్తివంత‌మైన స్పీచ్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఆస‌క్తిక‌రంగా అస‌లు స‌నాత‌న ధ‌ర్మం అంటే గిట్ట‌ని చోట ఎన్బీకే దీని గురించి బ‌లంగా త‌న భావ‌న‌ల‌ను తెలియ‌జేసాడు. స‌నాత‌నాన్ని పూర్తిగా వ్య‌తిరేకించి స్టాలిన్‌ల‌కు క‌నువిప్పు క‌లిగిస్తూ బాల‌య్య ఇచ్చిన స్పీచ్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న సమ‌యంలో ఎన్బీకే స్పీచ్ మరింత అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మారింది. నేను హిందువును.. స‌నాత‌నాన్ని అనుస‌రిస్తాన‌ని బాల‌య్య చెప్పారు. ధ‌ర్మాన్ని తాను బ‌లంగా న‌మ్ముతాన‌ని అన్నారు. బుధవారం చెన్నైలో జ‌రిగిన స‌మావేశంలో అఖండ 2లోని ఇతివృత్తం గురించి బాలయ్య‌ ప్రత్యేకంగా మాట్లాడారు.

సనాతన ధర్మం గురించి అందరికీ తెలుసు కానీ.. భవిష్యత్ తరాలు అఖండ 2 సినిమా ద్వారా సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు. సినిమా ఒక శక్తివంతమైన మీడియా.. ప్రజలు మాట్లాడుకోవ‌డానికి, ఒక శ‌క్తివంత‌మైన భావనను వారు జీర్ణించుకోవడానికి మంచి వేదిక. ప్రజలు ప్రతిరోజూ తమ దినచర్యలో తాము ఉంటారు.. స‌నాత‌నం ప్ర‌జ‌లకు మనశ్శాంతిని ఇస్తుంది. భవిష్యత్ తరాలకు సనాతన ధర్మం గురించి ఈ సినిమా నేర్పుతుంది! అని ఆయన వివరించారు.

మద్రాస్ నా జన్మ భూమి, తెలంగాణ నా కర్మ భూమి, ఆంధ్ర నా ఆత్మ భూమి. జార్జియా వంటి వివిధ దేశాలలో షూటింగ్ జరుగుతున్నప్పటికీ అఖండ 2 కేవలం 130 రోజుల్లోనే చిత్రీకరించాం. దేవుని దయ లేకుండా ఇది సాధ్యం కాదు... అని బాల‌య్య అన్నారు.