Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కోసం బాల‌య్య త్యాగం..

సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిన త‌ర్వాత ఒక హీరో గురించి మ‌రో హీరో అభిమానులు చేసే నెగిటివ్ ప్ర‌చారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   13 Dec 2025 3:46 PM IST
ప‌వ‌న్ కోసం బాల‌య్య త్యాగం..
X

సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిన త‌ర్వాత ఒక హీరో గురించి మ‌రో హీరో అభిమానులు చేసే నెగిటివ్ ప్ర‌చారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ చేసే పాజిటివ్ క్యాంపైనింగ్ కంటే ఇత‌ర హీరోల అభిమానులు చేసే నెగిటివ్ ప‌బ్లిసిటీనే ఎక్కువైపోతుంది. టాలీవుడ్ లో మ‌రీ ముఖ్యంగా నంద‌మూరి, మెగా ఫ్యామిలీల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఫ్యాన్ వార్స్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

మేమూ మేమూ బాగానే ఉంటాం. కానీ మీరే ఇంకా బావుండాలి అని ఆ మ‌ధ్య సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్ వార్స్ గురించి ఓపెన్ గానే చెప్పారు. కానీ ఎవ‌రేం చెప్పినా ఫ్యాన్స్ మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా వారి ప‌ని వారు చేసుకుంటూనే పోతుంటారు. అయితే అస‌లు ఇప్పుడీ టాపిక్ ఎందుకొచ్చిందంటే మెగా హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్, నంద‌మూరి హీరో బాల‌కృష్ణ ఫ్యాన్స్ మ‌ధ్య కూడా సోష‌ల్ మీడియాలో వార్స్ జ‌రుగుతుంటాయి.

సెప్టెంబ‌ర్ 25న రిలీజ‌వాల్సిన అఖండ‌2

కానీ ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వారిద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ బాండింగ్ తోనే ప‌వ‌న్ కోసం బాలయ్య ఏకంగా త‌న సినిమానే పోస్ట్ పోన్ చేసుకుని ఆ రిలీజ్ డేట్ ను త్యాగం చేసిన‌ట్టు అఖండ‌2 డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. వాస్త‌వానికి ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే అఖండ‌2 సెప్టెంబ‌ర్ 25కి రావాల్సింది. కానీ వాయిదా ప‌డింది.

దానికి కార‌ణం ప‌వ‌న్ త‌న ఓజి సినిమాను రిలీజ్ చేయాల‌నుకోవ‌డ‌మేన‌ని బోయ‌పాటి చెప్పారు. సెప్టెంబ‌ర్ లో అఖండ‌2 వాయిదా ప‌డిన‌ప్పుడు అంద‌రూ షూటింగ్ అవ‌క‌పోవ‌డం చేత‌నే పోస్ట్ పోన్ అయింద‌నుకున్నారు కానీ త‌మ సినిమా షూటింగ్ ను జూన్ ఆఖ‌రికే పూర్తి చేశామ‌ని, జార్జియాలో క్లైమాక్స్ షూట్ చేసుకుని ఆగ‌స్ట్ 10కి రీరికార్డింగ్ కూడా అయిపోగొట్టామ‌ని, కానీ ఈలోపు వేరే సినిమాలొచ్చాయ‌ని, ఓజి కూడా ద‌స‌రాకే వ‌స్తుందని తెలిసి ఒకరి మీద ఒక‌రు పోటీకి దిగ‌డ‌మెందుక‌ని త‌మ్ముడు సినిమా ఓజికి ఈసారి దారిద్దామ‌ని బాల‌య్య చెప్ప‌డం వ‌ల్లే అఖండ‌2 వాయిదా ప‌డింద‌ని, అఖండ‌2 డిసెంబ‌ర్ 2న వ‌చ్చింద‌ని, ఇప్పుడు అఖండ‌2 డిసెంబ‌ర్ 5న రిలీజ్ చేద్దామ‌ని చెప్పార‌ని, ఆ ప్ర‌కార‌మే సెప్టెంబ‌ర్ నుంచి త‌మ సినిమాను వాయిదా వేసి ప‌వ‌న్ ఓజికి బాల‌య్య దారి ఇచ్చార‌ని బోయ‌పాటి వెల్ల‌డించారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ ఫ్యాన్స్ బాల‌య్య మంచిత‌నాన్ని ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.