Begin typing your search above and press return to search.

NBK112 : నందమూరి తమ్ముడు వద్దా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   27 Oct 2026 11:00 PM IST
NBK112 : నందమూరి తమ్ముడు వద్దా?
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. బాలకృష్ణ నటిస్తున్న సినిమాలకు వరుసగా తమన్‌ సంగీతాన్ని అందించడం ఈ మధ్య కాలంలో కామన్‌ అయింది. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌, అఖండ 2 సినిమాలకు తమన్‌ సంగీతాన్ని అందించాడు. తమన్‌ సంగీతం ఇచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. బాలకృష్ణ, తమన్‌ మద్య మంచి బాండింగ్ క్రియేట్‌ అయింది. తమన్‌ ను బాలకృష్ణ ఏకంగా నందమూరి తమన్‌ అంటూ పేరు పెట్టి తన తమ్ముడు అంటూ ప్రకటించాడు. తమన్‌ కి ఒక ఖరీదైన కారును సైతం బాలకృష్ణ గిఫ్ట్‌ గా ఇవ్వడం జరిగింది.

బాలకృష్ణ దాదా సినిమా కోసం...

ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న దాదా సినిమాకు సైతం తమన్‌ ప్రాణం పెట్టి సంగీతాన్ని ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రజనీ కాంత్‌ సినిమాకు అనిరుధ్‌ పూనకం వచ్చినట్లుగా ఎలా అయితే సంగీతాన్ని ఇస్తాడో, అలాగే బాలకృష్ణ సినిమాకు తమన్‌ అంతకు మించి అన్నట్లుగా సంగీతాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే బాలకృష్ణ తదుపరి సినిమాకు సైతం తమన్‌ సంగీతాన్ని అందిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే దాదా తర్వాత బాలకృష్ణ నటించబోతున్న సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబో మూవీని నవంబర్‌ లో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. దాదా షూటింగ్‌ పూర్తి చేయడమే ఆలస్యం, వెంటనే కొరటాల శివ షూటింగ్‌లో బాలకృష్ణ పాల్గొనడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఎన్‌బీకే112 సినిమా షూటింగ్‌...

బాలకృష్ణ దాదా సినిమా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చేప్పటికి కొరటాల శివ ఎన్‌బీకే112 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే హీరోయిన్‌ గా సంయుక్త మీనన్‌ ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు సంగీత దర్శకుడి విషయమై చర్చలు మొదలు అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా అనగానే ఎక్కువ శాతం మంది దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం ఇస్తాడని అనుకున్నారు. ఆయన కాకుంటే కచ్చితంగా తమన్‌ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేస్తారని అనుకున్నారు. కానీ షాకింగ్‌గా కొరటాల శివ ఈ సినిమా కోసం అనిరుధ్‌ ను సంగీత దర్శకుడిగా అనుకున్నాడు. ఆయనతో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆయన ఈ సినిమాకు వర్క్‌ చేయడం లేదని తేలిపోయింది.

కొరటాల మూవీకి తమన్‌ సంగీతం...?

విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ, కొరటాల శివ సినిమాకు అనిరుధ్‌ సంగీతాన్ని ఇచ్చేందుకు భారీ పారితోషికం డిమాండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. దాంతో దర్శకుడు కొరటాల శివ తప్పని పరిస్థితుల్లో మరో సంగీత దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. అనిరుధ్‌ పారితోషికం కారణంగా తప్పుకోవడంతో ఆ స్థానంలో తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ను లైన్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌, జీవీ ప్రకాష్ ను చూస్తున్న కొరటాల శివ ఎందుకు బాలకృష్ణ తమ్ముడు అయిన తమన్‌ ను చూడలేక పోతున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నందమూరి తమన్‌ అంటూ పేరు దక్కించుకున్న తమన్‌ ను ఎందుకు కొరటాల శివ దూరం పెడుతున్నాడు అనే చర్చ మొదలైంది.

కొరటాల శివ కెరీర్‌ ఆరంభం నుంచి దేవి శ్రీ ప్రసాద్‌ తో వర్క్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత అనిరుధ్‌ తో దేవరకు వర్క్‌ చేశాడు. ఇప్పుడు తమన్‌ తో చేస్తే బాగుంటుంది కదా అని బాలకృష్ణ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొరటాల శివ నిర్ణయం ను బాలకృష్ణ సమర్ధిస్తాడా? తమన్‌ విషయంలో పట్టుబట్టకుండా ఉంటాడా అనేది చూడాలి. బాలకృష్ణ సినిమాకు తమన్‌ అయితేనే ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇస్తాడు అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. మరి కొరటాల మనసులో మాత్రం వేరే ఉంది. షూటింగ్‌ ప్రారంభం అయ్యేప్పటికి ఫ్యాన్స్ మనసును కొరటాల అర్థం చేసుకుని తమన్‌ తో వర్క్ చేస్తాడా అనేది చూడాలి.