NBK - మలినేని పాన్ ఇండియా పథకం?
చారిత్రక నేపథ్యం, టైమ్ ట్రావెల్ కథ అనగానే ఇది పూర్తిగా ప్రయోగాత్మక పంథాలో రూపొందించాల్సి ఉంటుంది. విజువల్ గాను ఒక కొత్త ఆరాను క్రియేట్ చేయాలి.
By: Sivaji Kontham | 2 Oct 2025 11:53 AM ISTనటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ-2` డిసెంబర్ 2025లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేసేందుకు బోయపాటి బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్బీకే నటించే తదుపరి చిత్రంపై ఇప్పటికే చాలా చర్చ సాగుతోంది. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని అందించిన గోపిచంద్ మలినేని ఈసారి ఎన్బీకేని ప్రయోగాత్మక పాత్రలో ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ఎన్.బి.కే 111 అనే తాత్కాలిక టైటిల్ ఇప్పటికే వైరల్ అవుతోంది.
ఈసారి చారిత్రక కథాంశానికి టైమ్ ట్రావెల్ నేపథ్యాన్ని జోడించి గోపిచంద్ మలినేని అద్భుతమైన స్క్రిప్టును సిద్ధం చేసారని కొంతకాలంగా కథనాలొస్తున్నాయి. ఈ సినిమా కథాంశం పాన్ ఇండియా అప్పీల్ తో రక్తి కట్టిస్తుందని కూడా చెబుతున్నారు. చారిత్రక నేపథ్యం, టైమ్ ట్రావెల్ కథ అనగానే ఇది పూర్తిగా ప్రయోగాత్మక పంథాలో రూపొందించాల్సి ఉంటుంది. విజువల్ గాను ఒక కొత్త ఆరాను క్రియేట్ చేయాలి. అందువల్ల సినిమాటోగ్రఫీ విభాగం పూర్తిగా ప్రయోగాత్మక ఐడియాలజీతో ఉండాలి.
అందుకే ఇప్పుడు కాంతార ఫేం అరవింద్ కశ్యప్ ని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకున్నారని కథనాలొస్తున్నాయి. కాంతార లాంటి చారిత్రక అంశాలతో ముడిపడిన నేటివిటీ జానపద కథకు అతడి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసిందని చెప్పాలి. అందుకే ఇప్పుడు ఎన్బీకే సినిమాకి అతడు ప్రధాన బలం కాబోతున్నాడన్న చర్చ సాగుతోంది. అరవింద్ కశ్యప్ కాంతార, కాంతర చాప్టర్ 1తో పాటు `కింగ్ ఆఫ్ కోత`(దుల్కార్) వంటి ప్రయోగాత్మక చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అతడి విలక్షణ శైలి విజువలైజైషన్ `కాంతార 1`లోను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకే ఇప్పుడు గోపిచంద్ మలినేని పట్టు బట్టి మరీ ఈ సినిమాటోగ్రాఫర్ ని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
వీర సింహారెడ్డి, అఖండ 2 లాంటి యాక్షన్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించడం వేరు... కాంతార లాంటి హిస్టారికల్ విజువల్ ఫీస్ట్ కి సినిమాటోగ్రఫీ అందించడం వేరు. టెక్నికల్ గా చాలా అంశాలను డీల్ చేయాల్సి రావొచ్చు. అందుకే ఇప్పుడు బాలయ్య- గోపిచంద్ తెలివిగా కాంతార కోసం పని చేసిన కశ్యప్ ని ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
పాన్ ఇండియా ట్రెండ్ లో హీరో ఎవరు? అనేది అనవసరం. తేజ సజ్జా లాంటి అప్ కమ్ హీరో పాన్ ఇండియాలో సెంచరీలు కొడుతుంటే బాలయ్య లాంటి సీనియర్ హీరో దీనిని సాధించలేరా? అందుకే ఇప్పుడు గోపిచంద్ మలినేని కసిగా హిస్టారికల్ అండ్ టైమ్ ట్రావెల్ కథతో గట్టి ప్లాన్ సిద్ధం చేసాడని గుసగుస వినిపిస్తోంది. సీనియర్ హీరోని పాన్ ఇండియా అప్పీల్ తో ఆవిష్కరించడానికి గోపిచంద్ మలినేని పథకం ఏమేరకు పారుతుందో చూడాలి.
