బాలయ్య సినిమా ఆ డెడ్‌లైన్ ను అందుకుంటుందా?
ప్రస్తుతం సినిమా షూటింగ్ కీలక దశలో కొనసాగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ప్రధాన తారాగణానికి సంబంధించిన సీన్స్, సాంగ్స్ షూటింగ్ వంటి పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తవ్వాల్సి ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 29 Jun 2026 11:30 AM ISTటాలీవుడ్‌లో పండుగ సీజన్‌కు సినిమాను రిలీజ్ చేయడమనేది కేవలం రిలీజ్ డేట్ సెలెక్షన్ మాత్రమే కాదు.. అది ఒక బిజినెస్ స్ట్రాటజీ కూడా. ముఖ్యంగా దసరా, సంక్రాంతి, సమ్మర్ వంటి సీజన్లలో ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, థియేటర్లలో లభించే అవకాశాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫుట్‌ఫాల్ వంటి అంశాలు నిర్మాతలకు భారీ ప్రయోజనాన్ని అందిస్తాయి. అందుకే ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న NBK111 సినిమాను కూడా దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో చిత్రబృందం వేగంగా పనులు పూర్తి చేస్తోందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ కీలక దశలో కొనసాగుతోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ప్రధాన తారాగణానికి సంబంధించిన సీన్స్, సాంగ్స్ షూటింగ్ వంటి పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తవ్వాల్సి ఉంది. దసరా రిలీజ్‌ను అందుకోవాలంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా పూర్తి చేయాల్సి ఉండటంతో మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా దసరా టార్గెట్ ను అందుకోవాలని ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెద్ద సినిమాల్లో చిన్న ఆలస్యం కూడా మొత్తం రిలీజ్ షెడ్యూల్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో మేకర్స్ ప్రతి దశను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తోంది.
ఇటీవలి కాలంలో పండుగ సీజన్‌లను టార్గెట్ గా చేసుకుని స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటి సమయంలో NBK111 కూడా దసరా బరిలో నిలిస్తే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరా టైమ్ కు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇతర భారీ సినిమాలు కూడా అదే సీజన్‌ను టార్గెట్ చేస్తే థియేటర్ల కేటాయింపు, షోల పంపిణీ, సినిమా ఓపెనింగ్స్ మరియు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే బాలకృష్ణకు పండుగ సీజన్‌లో విడుదలైన మాస్ ఎంటర్‌టైనర్లు మంచి ఆదరణ పొందిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. అందుకే ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఇప్పటికే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ ఉండటం, ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ఒకవేళ ఏదైనా ఆలస్యమై సినిమా అనుకున్నట్టు దసరా టైమ్ కు రాకపోతే రిలీజ్ డేట్ ను కాస్త వెనక్కి జరిపి డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ చేయాలని కూడా టీమ్ ప్లాన్-బి ని కూడా రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. మేకర్స్ మొదటి ప్రాధాన్యం మాత్రం దసరా మార్కెట్‌పైనే ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడందరి దృష్టి మేకర్స్ షూటింగ్ డెడ్‌లైన్‌ను అందుకుంటారా? లేక బాక్సాఫీస్ పోరాటం మరికొంత ఆలస్యంగా మొదలవుతుందా? అనే దానిపై నెలకొంది.
