బాలయ్య స్పీడ్.. డిసెంబర్ టార్గెట్ మిస్ అయ్యేలా లేదే!
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ మీద రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Aug 2026 10:32 AM ISTబాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా రిలీజ్ డేట్ మీద రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వాయిదా పడే చాన్స్ ఉందని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే సినిమాను ఎలాగైనా డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగితే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చినా బాలయ్య మాత్రం వెనక్కి తగ్గలేదని టాక్. వచ్చే పండుగ సీజన్ కు ఇప్పటికే చాలా సినిమాలు క్యూ కట్టాయి కాబట్టి వాటన్నింటికీ దారి ఇచ్చి తన సినిమాను ముందే థియేటర్లలోకి దించాలని ఆయన నిర్ణయించుకున్నారట.
ఇలాంటి ప్లానింగ్ లో ఉన్న టైమ్ లోనే బాలయ్యకు మోకాలి గాయం అయింది. తన 111వ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు గాయపడటంతో ఆయన రీసెంట్ గా సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్లు కనీసం రెండు నెలల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. అయినా సరే సెప్టెంబర్ నుంచే మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టాలని ఆయన భావిస్తున్నారట.
తన వల్ల షూటింగ్ ఆలస్యమై నిర్మాతకు ఎలాంటి నష్టం రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇంత త్వరగా రికవరీ మీద ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. బాలయ్య డెడికేషన్ కు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా పక్కా షెడ్యూల్ రెడీ చేస్తోంది. సెప్టెంబర్ లో మెయిన్ సీన్స్ అన్నీ పూర్తి చేసి అక్టోబర్ నెలలో ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఆ తర్వాత నవంబర్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్ లో సినిమా రిలీజ్ కావడం ఖాయం. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ప్రొడ్యూసర్ వెంకట సతీశ్ కిలారు కూడా ఇదే టైమ్ లైన్ తో వర్క్ స్పీడప్ చేసినట్లు సమాచారం. షూటింగ్స్ లో బాలయ్య గాయపడటం ఇదే తొలిసారి కాదు. తన కెరీర్ మొదట్లో బాబాయ్ అబ్బాయ్, భార్యాభర్తల బంధం సినిమాల టైమ్ లో కూడా ఇలాగే దెబ్బలు తగిలాయి.
ఇక విజయేంద్రవర్మ షూటింగ్ సమయంలో మోకాలికి గాయం కావడంతో అప్పట్లో కొన్ని నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అయినా సరే కెరీర్ స్టార్టింగ్ లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ పని పట్ల తనకున్న కమిట్మెంట్ ఏంటో అప్పుడే నిరూపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన ముందుకు వెళ్తున్నారు. నిర్మాతల పట్ల బాలయ్యకు ఉన్న ఈ బాధ్యతను చూసి ఇండస్ట్రీ జనాలు ఆయన తండ్రి ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుంటున్నారు. పల్లెటూరి పిల్ల సినిమా రోజుల నుంచే ఎన్టీఆర్ చేతికి చాలాసార్లు గాయాలు అయ్యాయి.
ఒక దశలో కుడి చేతి వేళ్లకు పట్టు కూడా తగ్గింది. సర్దార్ పాపారాయుడు సినిమా టైమ్ లో మళ్లీ చేతికి దెబ్బ తగిలినా నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆయన కట్టుతోనే నటించారు. తండ్రికి ఉన్న అదే డెడికేషన్ ఇప్పుడు బాలయ్యలోనూ కనిపిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. డిసెంబర్ నెల బాలయ్యకు గతంలో చాలా విజయాలు అందించింది. పట్టాభిషేకం సినిమాతో తన కెరీర్ లోనే తొలిసారి భారీ ఓపెనింగ్స్ రాబట్టారు.
ఆ తర్వాత వచ్చిన లారీ డ్రైవర్ కూడా సంచలన విజయం సాధించింది. ఇక కరోనా తర్వాత జనాలను మళ్లీ థియేటర్లకు రప్పించిన అఖండ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయింది. అయితే ఈసారి ఆ నెలలో గట్టి పోటీ ఉండబోతోంది. డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ, 18న అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ 3, 24న షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఈ పోటీని తట్టుకుని సరైన డేట్ సెట్ చేసుకోవడమే ఇప్పుడు మేకర్స్ ముందున్న అసలు సవాల్.
