బాలయ్య మీద అంత పెడతారా?
By: Garuda Media | 25 Jun 2026 10:00 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మార్కెట్ కొన్నేళ్ల ముందు ఎంతగా డౌన్ అయిందో తెలిసిందే. యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు, రూలర్ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో ఆయన మిడ్ రేంజ్ హీరోలతో కూడా పోటీ పడలేని స్థితిలో కనిపించారు. కానీ ‘అఖండ’ నుంచి ఆయన దశ తిరిగింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుస హిట్లతో దూసుకెళ్లారు. దీంతో ఆయన మార్కెట్ ఐదేళ్ల ముందుతో పోలిస్తే కొన్ని రెట్లు పెరిగింది.
వంద కోట్ల బడ్జెట్ అయినా బాలయ్య మీద వర్కవుట్ అయ్యే రేంజ్ వచ్చింది. కానీ బడ్జెట్ అంతకుమించితే మాత్రం కష్టమన్నది మాత్రం వాస్తవం. ‘అఖండ-2’ మీద అతి నమ్మకానికి పోయి రూ.150 కోట్ల దాకా పెట్టేశారు నిర్మాతలు. సినిమాను కూడా భారీ రేట్లకు అమ్మారు. కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఆ చిత్రం.. నిర్మాతలు, బయ్యర్లకు చేదు అనుభవాన్నే మిగిల్చింది.
‘అఖండ-2’ రిలీజ్ కావడానికి ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేయాల్సిన పీరియడ్ మూవీకి రూ.200 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ‘అఖండ-2’ రిజల్ట్ చూశాక అది రిస్కీ అని భావించి, ఆ భారీ చారిత్రక కథను పక్కన పెట్టేశారు. బడ్జెట్ తగ్గించుకుని రెగ్యులర్ కమర్షియల్ కథతోనే ముందుకు వెళ్తున్నారు. ఐతే ఇప్పుడు బాలయ్య హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. ఈ చిత్రాన్ని ‘దేవర’ నిర్మాత మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. ఈ మూవీ మీద రూ.150 నుంచి రూ.200 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నట్లు ప్రకటించారు.
ఐతే బాలయ్య, కొరటాల కాంబో మీద మరీ అంత పెట్టడం రిస్క్ కాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘అఖండ-2’ లాంటి క్రేజీ సీక్వెలే బడ్జెట్ రికవర్ చేయనపుడు.. బాలయ్య, కొరటాల శివ సినిమాతో ఈ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం అంత తేలిక కాదు. ఆల్రెడీ నాని మూవీ ‘ది ప్యారడైజ్’ మీద అయినకాడికి ఖర్చు పెట్టి నానా తంటాలు పడుతున్నాడు సుధాకర్ చెరుకూరి. మళ్లీ బాలయ్య సినిమాకు ఇంత బడ్జెట్ అంటే ఆయన సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే.
