బాలయ్య కొరటాల.. ఆ ఇద్దరిలో ఒకరు!
ఇక ఆ ప్రాజెక్ట్ లో కీలకంగా మారిన అంశం మ్యూజిక్ డైరెక్టర్ సెలక్షన్. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు.
By: M Prashanth | 5 May 2026 3:15 PM ISTటాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కబోయే కొత్త ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
రీసెంట్ గా అఖండ 2 ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోకపోయినా బాలయ్య తన స్పీడ్ ను తగ్గించకుండా వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ చేస్తున్న ఆయన, తదుపరి చిత్రంగా కొరటాల శివతో పని చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
కొరటాల శివ స్టైల్ అంటే సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేయడం. అదే ఫార్ములాను ఈసారి కూడా కొనసాగిస్తూ బాలయ్య ఇమేజ్ కు సరిపోయే పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇచ్చిన ఆ కథలో బాలయ్యను కంప్లీట్ మాస్ అవతార్‌లో చూపించబోతున్నారట.
ఇక ఆ ప్రాజెక్ట్ లో కీలకంగా మారిన అంశం మ్యూజిక్ డైరెక్టర్ సెలక్షన్. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా వర్క్ చేస్తున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఇప్పుడు కొరటాల మూవీకి తమన్ ఫిక్స్ అవుతారని భావించారు. అయితే కొరటాల తన గత సినిమాలను పరిశీలిస్తే పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది.
ఆయన ఎక్కువగా దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి పని చేశారు. మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు వీరి కాంబినేషన్ హిట్ ట్రాక్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. దీంతో బాలయ్య ప్రాజెక్ట్ కోసం కూడా డీఎస్పీని తీసుకునే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు దేవర చిత్రంతో కొరటాల మొదటిసారి అనిరుధ్ రవిచందర్ తో పనిచేశారు. ఆ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ గా నిలిచింది.
దీంతో అదే నమ్మకంతో ఈసారి కూడా అనిరుధ్ కే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో కొరటాల ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అలా తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. చివరికి ఎవరి పేరు ఫిక్స్ అవుతుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు క్లారిటీ రానుంది. ఆదే సమయంలో ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త కూడా వైరల్ అవుతోంది.
బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, కీలక పాత్ర కోసం సంజయ్ దత్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మొత్తానికి మాఫియా బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్, స్టార్ క్యాస్టింగ్.. అన్నీ కలిపి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర తర్వాత కొరటాల తెరకెక్కించే చిత్రం కావడంతో కథపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్న ఆ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
