బిగ్ డిబేట్: షూటింగ్ గాయాలు-సెంటిమెంట్లు.. ఆ ట్రాక్ రికార్డును బాలయ్య తిరగరాస్తారా?
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
By: Sivaji Kontham | 22 July 2026 9:44 AM ISTసినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్లు, ఫ్లాప్పుల లెక్కలను కూడా ఏదో ఒక సెంటిమెంట్‌కు ముడిపెట్టడం టాలీవుడ్‌లో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణకు సెట్‌లో స్వల్ప ప్రమాదం జరగడంతో.. దీనిపై ఆరాలు తీయడమే కాకుండా.. బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సినీ ప్రియులు.. నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన `బిగ్ డిబేట్` మొదలైంది. కెరీర్‌లో బాలయ్యకు గాయాలైన సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే నెగటివ్ సెంటిమెంట్ ని గుర్తు చేస్తూ.. ఈసారి ఆయన దాన్ని బ్రేక్ చేస్తారా లేదా అన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గత చరిత్రను ఒక్కసారి తిరగేస్తే.. బాలకృష్ణకు సెట్స్‌లో గాయాలైన ప్రతిసారీ బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. 1985లో జంద్యాల దర్శకత్వంలో వచ్చిన `బాబాయ్ - అబ్బాయ్` షూటింగ్‌లో కార్ డ్రైవింగ్ సీన్ సమయంలో ఆయన నడుముకు గాయమైంది. ఆ చిత్రం కమర్షియల్‌గా రాణించలేదు. అదే ఏడాది `భార్యాభర్తల బంధం` ఫైట్ సీన్‌లో మోకాలుకు బలమైన దెబ్బ తగలగా ఆ సినిమా కూడా ఓ మోస్తరుగానే ఆడింది. ఆ తర్వాత 2004లో వచ్చిన `విజయేంద్ర వర్మ`, 2015లోని `లయన్` చిత్రాల సమయంలోనూ కాలుకి తీవ్ర గాయాలై బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావడం.. ఆ సినిమాలు పరాజయం పాలుకావడం ఒక నెగటివ్ సెంటిమెంట్‌గా బలంగా మారిపోయింది.
అయితే తండ్రి స్థానంలో ఉన్న నటరత్న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఈ ప్రమాదాల సెంటిమెంట్ సరిగ్గా భిన్నంగా (పాజిటివ్‌గా) పనిచేయడం గమనార్హం. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో `పల్లెటూరి పిల్ల` సమయంలో ఎద్దు పొడవడంతో ముఖంపై మాయని మచ్చ పడేలా గాయపడ్డారు. `లక్ష్మీ కటాక్షం` సెట్‌లోనూ దెబ్బలు తగిలాయి. `దీక్ష` టైమ్‌లో పాము కరవడం..దాసరి దర్శకత్వంలో వచ్చిన`సర్దార్ పాపారాయుడు` సమయంలో తీవ్రంగా గాయపడటం ప్రజల్లో చర్చకు వచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా `దీక్ష` ఓ మోస్తరుగా ఆడితే, మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించి చరిత్ర సృష్టించాయి.
ఈ రకంగా చూస్తే... సెట్స్‌లో ప్రమాదం జరగడం తండ్రి ఎన్టీఆర్‌కు అదృష్టాన్ని తీసుకొస్తే...కొడుకు బాలకృష్ణకు మాత్రం ఇప్పటివరకు కలిసి రాలేదు. ఈ `తండ్రి వర్సెస్ కొడుకు` విభిన్న సెంటిమెంట్లే ఇప్పుడు అభిమానుల్లోను, సినీ విశ్లేషకుల్లోను పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. గతంలో ఎదురైన ఈ చేదు అనుభవాల ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని.. ఈసారి రానున్న సినిమా ఫలితం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నందమూరి అభిమానుల్లో నెలకొంది.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన జోష్‌తో పాటు.. బాలయ్య ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తుంటే ఈ పాత కాలపు సెంటిమెంట్‌కు చెక్ పడటం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కొత్త చిత్రంతో బాలకృష్ణ తన పాత గాయాల సెంటిమెంట్‌ను తుడిచిపెట్టేసి..తండ్రి ఎన్టీఆర్ లాగే సరికొత్త రికార్డులను సృష్టిస్తారో లేదో వేచి చూడాలి!
