Begin typing your search above and press return to search.

డిసెంబర్ బాక్సాఫీస్ సమీకరణాలు మారతాయా? బాలయ్య గాయం తర్వాత #NBK111 రిలీజ్‌పై కొత్త డిస్క‌ష‌న్!

అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఆ ప్రణాళికల్లో మార్పులు తీసుకురావచ్చనే చ‌ర్చ‌ ఇండస్ట్రీలో మొదలైంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 July 2026 12:30 PM IST
డిసెంబర్ బాక్సాఫీస్ సమీకరణాలు మారతాయా? బాలయ్య గాయం తర్వాత #NBK111 రిలీజ్‌పై కొత్త డిస్క‌ష‌న్!
X

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది డిసెంబర్ సీజన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోల సినిమాలు ఈ విండో కోసం పోటీ పడుతుంటాయి. ఈ ఇయ‌ర్ కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న #NBK111 డిసెంబర్ రిలీజ్ టార్గెట్ గా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని చిత్రబృందం భావించింది. అయితే తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఆ ప్రణాళికల్లో మార్పులు తీసుకురావచ్చనే చ‌ర్చ‌ ఇండస్ట్రీలో మొదలైంది.

యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ టైమ్ లో బాలకృష్ణ గాయపడిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు చేరుకుని ఆస్పత్రిలో చేరనున్నట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు చిన్నపాటి స‌ర్జ‌రీ చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అఫీషియ‌ల్ గా షూటింగ్ షెడ్యూల్‌పై ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాకపోయినా, ఈ బ్రేక్ సినిమా పనుల వేగంపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

బాలకృష్ణ కెరీర్‌ను గమనిస్తే, గ‌తంలో కూడా గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఎక్కువకాలం షూటింగ్‌లకు దూరంగా లేరు. గతంలో కూడా శారీరక ఇబ్బందులను అధిగమించి కమిట్‌మెంట్‌తో సెట్స్‌కు తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా బాలయ్య వర్క్ ఎథిక్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన క్ర‌మ‌శిక్ష‌ణ‌, కష్టపడే తత్వం, షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అందుకే ఈసారి కూడా కోలుకున్న వెంటనే షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.

అయితే మరోవైపు డిసెంబర్ రిలీజ్ అనేది కేవలం షూటింగ్ పూర్తవడమే కాదు. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీజీ వర్క్, ప్రమోషన్స్ వంటి కీలక దశలు కూడా సమయానికి ముగియాల్సి ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్‌లో చిన్న ఆల‌స్యం జరిగినా తర్వాతి పనులన్నీ వరుసగా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే #NBK111 టార్గెట్ గా పెట్టుకున్న డిసెంబ‌ర్ రిలీజ్ పై ఇప్పుడు ప్రత్యేక దృష్టి నెలకొంది. ఒకవేళ సినిమా డిసెంబర్ రేసు నుంచి తప్పుకుంటే, ఆ స్లాట్ కోసం ఎదురు చూస్తున్న ఇతర సినిమాల‌కు అదనపు అవకాశాలు లభించవచ్చు. ముఖ్యంగా భారీ సినిమాల మధ్య స్క్రీన్‌ల కోసం జరిగే పోటీ కొంత తగ్గే అవకాశం ఉంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా రిలీజ్ క్యాలెండర్‌ను కొత్తగా ప్లాన్ చేసే పరిస్థితి రావచ్చు. అదే సమయంలో బాలయ్య సినిమా వాయిదా పడితే, ఆ ఖాళీని మరో పెద్ద సినిమా భర్తీ చేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు.

అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇండ‌స్ట్రీలో జరుగుతున్న డిస్క‌ష‌న్సే తప్ప, #NBK111 రిలీజ్ డేట్ లో మార్పుపై మేక‌ర్స్ నుంచి ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. బాలకృష్ణ ఎంత వేగంగా కోలుకుంటారు, షూటింగ్ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుంది, మిగిలిన పనులు ఎంత త్వరగా పూర్తవుతాయనే అంశాలపైనే డిసెంబర్ బాక్సాఫీస్ సమీకరణాలు ఆధారపడనున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ దృష్టి మొత్తం బాలయ్య ఆరోగ్యంతో పాటు #NBK111 తదుపరి షెడ్యూల్‌పైనే నిలిచింది.