Begin typing your search above and press return to search.

బాలకృష్ణకి గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు.. డైరెక్టర్ గోపీచంద్ పోస్ట్ వైరల్!

నటసింహ నందమూరి బాలకృష్ణకు గాయాలు కాగా.. హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది.

By:  Madhu Reddy   |   21 July 2026 3:40 PM IST
బాలకృష్ణకి గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు.. డైరెక్టర్ గోపీచంద్ పోస్ట్ వైరల్!
X

నటసింహ నందమూరి బాలకృష్ణకు గాయాలు కాగా.. హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది. మరి వైద్యులు ఏమన్నారు? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అసలు ఆయనకు గాయాలు తగలడం వెనుక అసలేమైంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

బాలకృష్ణకు షూటింగ్లో ప్రమాదం..

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం NBK 111. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అనేసరికి అభిమానులతో పాటూ సినీ ప్రేక్షకులలో కూడా అంచనాలు పెరిగిపోయాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పోర్టు ప్రాంగణంలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ షూటింగ్ జరుగుతుండగా బాలయ్య ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డారట.

బాలకృష్ణ - మంచు మనోజ్ మధ్య యాక్షన్ సీన్స్..

సినిమాలో కీలకమైన పోరాట సన్నివేశాలలో.. మంచు మనోజ్ - బాలకృష్ణ పై యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. ఈ సమయంలో ఫైట్ చేస్తున్నప్పుడు బాలకృష్ణ స్టంట్ చేస్తుండగా సడన్గా కాలుజారి కిందపడడంతో ఆయన మోకాలికి బలమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన చిత్రబృందం బాలయ్యను దగ్గర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా.. వైద్యులు బాలకృష్ణకు చికిత్స అందిస్తున్నారట . గాయం తీవ్రతను తెలుసుకునేందుకు బాలయ్య మోకాలికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారని, ఈ స్కానింగ్ రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది అని , వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి పై పూర్తి వివరాలు వెలవడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రమాదానికి బాలకృష్ణ గురయ్యారు అనే వార్త నందమూరి అభిమానులను ఆందోళనలకు గురిచేస్తోందని చెప్పవచ్చు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

బాలయ్య ఆరోగ్యం పై గోపీచంద్ క్లారిటీ..

ఇకపోతే ఈ విషయంపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బాలయ్య ఆరోగ్యం పై ఒక ట్వీట్ వేశారు. "NBK 111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మసిల్ టియర్ అయింది.

వైద్యుల సూచన మేరకు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న సర్జరీ చేయాల్సి ఉంది. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK 111 సినిమా బృందంలోని ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తినిస్తుంది.

అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకొని ,మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.."అంటూ తెలిపారు.

సంక్రాంతికి ముందే విడుదల..

ఇదిలా ఉండగా మరొకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగు చకచకా జరుగుతోంది. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ముందుగానే అనగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.