Begin typing your search above and press return to search.

ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్.. అక్కడ కూడా జై బాలయ్య మోత..

ఆ స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకోవడంతో పాటు తెలుగు సినిమా ప్రతిష్టను మరో పెద్ద వేదికపై మరోసారి చాటిచెప్పింది.

By:  M Prashanth   |   26 March 2026 10:38 PM IST
ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్.. అక్కడ కూడా జై బాలయ్య మోత..
X

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బుధవారం గ్రాండ్ గా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 (IFFD 2026)లో టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఆ స్పెషల్ స్క్రీనింగ్ కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకోవడంతో పాటు తెలుగు సినిమా ప్రతిష్టను మరో పెద్ద వేదికపై మరోసారి చాటిచెప్పింది.




దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి మూవీ ఇప్పటికే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ అవార్డు తర్వాత ఇప్పుడు మూవీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించడం విశేషంగా మారింది. ఆ స్క్రీనింగ్‌ కు బాలకృష్ణతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా హాజరై సందడి చేశారు.




స్క్రీనింగ్ అనంతరం ఈవెంట్‌ ను ఉద్దేశించి మాట్లాడిన బాలకృష్ణ, తనకు లభించిన ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల ప్రేమే తనకు నిజమైన బలం అని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మాట్లాడుతూ, ఆ చిత్రానికి వచ్చిన గుర్తింపు మొత్తం టీమ్ కృషి ఫలితమని చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించారు.

ఇక భగవంత్ కేసరి మూవీ స్పెషల్ స్క్రీనింగ్‌ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. సినిమా ప్రదర్శన జరుగుతున్నంతసేపు అక్కడ ఉన్న వారంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతా సినిమాను ఫుల్ గా ఆస్వాదించినట్లు ఉన్నారని ఇప్పుడు నందమూరి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు, అదే ఫెస్టివల్‌ లో బాలకృష్ణకు అత్యున్నత గౌరవం దక్కింది. ఆయన సినీ జీవితంలో చేసిన విశేష సేవలను గుర్తిస్తూ నిర్వాహకులు ప్రతిష్టాత్మక లైఫ్‌ టైమ్ అచీవ్‌ మెంట్ అవార్డుతో సత్కరించారు. ఆ అవార్డు అందుకోవడం ఆయన కెరీర్‌ లో మరో మైలురాయిగా నిలిచింది. దిల్లీలోని ప్రముఖ భారత మండపంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఆ పురస్కారాన్ని స్వీకరించారు. వేడుకలో ఆయనకు ఘన సత్కారం అందించారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర రంగానికి సేవలందిస్తున్న బాలకృష్ణకు ఆ అవార్డు రావడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. మొత్తానికి భగవంత్ కేసరి చిత్రానికి అంతర్జాతీయ వేదికపై లభించిన గౌరవం, అలాగే బాలకృష్ణకు లైఫ్‌ టైమ్ అచీవ్‌ మెంట్ అవార్డు దక్కడం టాలీవుడ్‌ కు గర్వకారణంగా నిలిచిందనే చెప్పాలి.