బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25Y ప్రయాణంపై నందమూరి బాలకృష్ణ ఎమోషనల్
ఈ సందర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రి ఒక పవిత్రమైన ఆశయానికి ప్రతిరూపం అని స్పష్టం చేశారు.
By: Sivaji Kontham | 23 Jun 2026 10:52 AM ISTకార్పొరేట్ యుగంలో వైద్యం అనేది ఒక ఖరీదైన వ్యాపారంగా మారిన తరుణంలో మానవత్వమే పరమావధిగా సాగుతున్న సేవా ప్రస్థానం `బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్`. ఈ ప్రతిష్టాత్మక సంస్థ విజయవంతంగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల వేదికపై నందమూరి బాలకృష్ణ గారి ప్రసంగం అత్యంత ఆత్మీయంగా.. భావోద్వేగభరితంగా సాగింది. ఒక నటుడిగానే కాకుండా...ఒక బాధ్యతాయుతమైన సంస్థ నిర్వాహకుడిగా చైర్మన్ హోదాలో ఆయన మాట్లాడిన మాటలు సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటిచెబుతున్నాయి. రోగి గెలిచే వరకు.. కుటుంబాలు నవ్వే వరకు బసవతారకం సేవలు కొనసాగుతూనే ఉంటాయి! అంటూ ఆయన ఇచ్చిన పిలుపు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రి ఒక పవిత్రమైన ఆశయానికి ప్రతిరూపం అని స్పష్టం చేశారు. 1984లో తన మాతృమూర్తి స్వర్గీయ బసవతారకం గారు క్యాన్సర్ మహమ్మారి బారిన పడి అనుభవించిన వేదనను, నరకయాతనను కళ్లారా చూసిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) తీసుకున్న ఒక మహా సంకల్పం ఈ హాస్పిటల్. భవిష్యత్తులో ఏ ఒక్క పేదవాడూ డబ్బు లేక వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు నాటిన ఆ మొక్క నేడు పాతికేళ్లు పూర్తి చేసుకుని వటవృక్షంలా మారడం వెనుక ఒక గొప్ప మానవీయ కోణం దాగి ఉందని ఆయన గుర్తుచేసుకున్నారు. అమ్మపై ఉన్న ప్రేమను, సమాజం పట్ల ఉన్న బాధ్యతను కలిపి నాన్నగారు వేసిన పునాది ఇది అని కొనియాడారు. కేవలం 100 బెడ్లతో మొదలైన ఈ ఆస్పత్రిని నెమ్మదిగా విస్తరించామని తెలిపారు. నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి సారథ్యంలో ఈ ఆస్పత్రి మొదలైన విషయాన్ని ఎన్బీకే గుర్తు చేసుకున్నారు. బసవతారకంలో దాదాపు 3.75లక్షల మంది క్యాన్సర్ రోగులు ఓపీ సేవల్ని అందుకున్నారని తెలిపారు.
ప్రస్తుత రోజుల్లో వైద్య రంగంలో లాభాల వేట ఎక్కువైనా బసవతారకం హాస్పిటల్ గత 25 ఏళ్లుగా `లాభాపేక్ష లేని నిరంతర సేవ` అనే నినాదానికే కట్టుబడి పనిచేస్తుండటాన్ని బాలకృష్ణ గారు గర్వంగా ప్రస్తావించారు. కేవలం ధనవంతులకే పరిమితం కాకుండా... సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి సైతం అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన క్యాన్సర్ వైద్యాన్ని అత్యంత తక్కువ ఖర్చుతో అనేక సందర్భాల్లో ఉచితంగా అందించడం ఈ సంస్థ సాధించిన అతిపెద్ద విజయం. దాతల నుంచి వచ్చే ప్రతి రూపాయిని అత్యంత పారదర్శకంగా రోగుల సేవకే వినియోగిస్తూ... నమ్మకానికి నిలువుటద్దంగా ఈ ఆసుపత్రి నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకమైన నిర్వహణ, రోగుల విషయంలో చూపే కరుణే ఈ సుదీర్ఘ ప్రయాణానికి బలమని విశ్లేషించారు.
ఆసుపత్రి చైర్మన్ హోదాలో బాలకృష్ణ అక్కడి వైద్య సిబ్బంది సేవలను అద్భుతం అంటూ కొనియాడారు. ఆసుపత్రికి ఎంతటి అధునాతన భవనాలు, వసతులు ఉన్నా.. అక్కడ పనిచేసే వైద్యులు, నర్సింగ్ .. పారామెడికల్ సిబ్బంది అందించే కరుణతో కూడిన వైద్యమే రోగులకు పునర్జన్మను ఇస్తుందని ఆయన అన్నారు. క్యాన్సర్ అనగానే రోగులలో వచ్చే మానసిక భయాన్ని పోగొట్టి, వారిలో బ్రతకాలనే నమ్మకాన్ని, కొండంత ధైర్యాన్ని నింపుతూ రాత్రింబగళ్లు శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ప్రత్యక్ష దైవాలుగా అభివర్ణించారు. ఆసుపత్రి ఎదుగుదలలో.. రోగుల ప్రాణాలు కాపాడటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆయన శిరస్సు వంచి, తలవంచి కృతజ్ఞతలు తెలపడం ఆయన సంస్కారానికి, నమ్రతకు నిదర్శనంగా నిలిచింది.
ఈ రజతోత్సవ వేడుక కేవలం గడిచిన కాలపు విజయాలను నెమరువేసుకోవడానికే కాదు...భవిష్యత్తు వైపు మరింత దృఢంగా అడుగులు వేయడానికి ఒక పునాది అని బాలకృష్ణ గారి ప్రసంగం ద్వారా ఒక స్పష్టమైన విజన్ వ్యక్తమైంది. మునుముందు రోజుల్లో వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న సరికొత్త అధునాతన సాంకేతికతను, రోబోటిక్ సర్జరీ విధానాలను, ఆధునిక వైద్య పరికరాలను బసవతారకం హాస్పిటల్‌లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తెస్తామని ఆయన ప్రకటించారు. క్యాన్సర్ రహిత సమాజం కోసం పరిశోధనలను మరింత ప్రోత్సహిస్తూ..తర తరాలకు కూడా ఈ ఆసుపత్రి ఒక ఆశాదీపంగా నిలుస్తుందని చెప్పారు.
