బాలయ్య- ఆత్రేయ.. మళ్ళీ అదే సెంటిమెంట్
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య.. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నారు.
By: M Prashanth | 13 May 2026 9:24 AM ISTనటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య.. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న ఆయన.. తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలయ్య చేయబోతున్న సినిమా హాట్ టాపిక్ గా మారింది.
బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం వంటి విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ.. తొలిసారి బాలయ్య వంటి మాస్ హీరోతో వర్క్ చేయబోతుండటంతో ఆ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్ ఫుల్ కమర్షియల్ కథను ఆత్రేయ సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది.
ఇప్పటికే ఆ సినిమాకు కురుక్షేత్రం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆ ప్రాజెక్టులో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆ చిత్రానికి ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న ప్రధాన కారణం బాలయ్య డ్యూయల్ రోల్ సెంటిమెంట్. కెరీర్ లో ఇప్పటివరకు బాలకృష్ణ దాదాపు 18 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు. అందులో చాలా సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా అపూర్వ సహోదరులుతో మొదలైన ఆ జర్నీ.. ఆదిత్య 369, పెద్దన్నయ్య, చెన్నకేశవరెడ్డి, సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగింది.
ఇందులో కొన్ని చిత్రాలు గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ రికార్డులు సృష్టించగా.. లెజెండ్ సినిమా వెయ్యి రోజులకు పైగా ఆడి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస హిట్స్ కూడా డ్యూయల్ రోల్స్‌తో రావడం అభిమానుల్లో సెంటిమెంట్ పై మరింత నమ్మకం పెంచింది. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే.. బాలయ్యతో తొలి సినిమానే చేస్తూ ఆయనకు డ్యూయల్ రోల్ ఇవ్వించిన దర్శకులు మంచి విజయాలు అందుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు, వీవీ వినాయక్, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని వంటి దర్శకులు ఆ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అదే లిస్ట్ లోకి వివేక్ ఆత్రేయ కూడా చేరబోతున్నారు. మరోవైపు వీరసింహారెడ్డి వచ్చిన మూడేళ్ల తర్వాత బాలయ్య మళ్లీ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఒకవైపు వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్ ప్లే.. మరోవైపు బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే థియేటర్లలో పండుగ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి డ్యూయల్ రోల్ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
