బాలయ్య దాదా.. టైమ్ సరిపోతుందా?
కాకినాడ పోర్టులో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్న సమయంలో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత దాదాపు రెండున్నర నెలలు విశ్రాంతి తీసుకున్నారు.
By: M Prashanth | 24 Oct 2026 7:00 PM ISTబాలకృష్ణ సినిమా అంటే షూటింగ్ స్పీడ్ విషయంలో పెద్దగా సందేహాలు ఉండవు. కానీ ఈసారి అనుకోని బ్రేక్ కారణంగా 'దాదా' టీమ్‌కు టైమ్ టెన్షన్ మొదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలని ఇప్పటికే ప్రకటించారు. మధ్యలో బాలయ్య గాయపడటంతో షూటింగ్ ఆగిపోయింది. అక్టోబర్‌లో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. అయితే రిలీజ్‌కు ఇంకా రెండు నెలలే ఉండటంతో మేకర్స్ ముందున్న పని తక్కువేమీ లేదు.
కాకినాడ పోర్టులో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్న సమయంలో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత దాదాపు రెండున్నర నెలలు విశ్రాంతి తీసుకున్నారు. అక్టోబర్ మొదటివారంలో మైసూరు షెడ్యూల్ మొదలైంది. అక్కడ కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ తర్వాత కూడా బాలయ్యపై దాదాపు 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంటుందని వార్తలొచ్చాయి. కాకినాడలో ఆగిపోయిన కొన్ని సీన్లను కూడా పూర్తి చేయాల్సి ఉందట. కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందనేది కీలకంగా మారింది.
ఇక 'దాదా'లో బాలయ్యను గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తున్నారు. 80ల నాటి ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనుంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌లో బాలయ్య లుక్, రైఫిల్ పట్టుకున్న తీరు మాస్ అభిమానులను ఆకట్టుకున్నాయి. 'వీరసింహారెడ్డి' తర్వాత గోపీచంద్ మలినేని మళ్లీ బాలయ్యతో వర్క్ చేస్తున్నాడు. గత సినిమాలో ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపిన దర్శకుడు ఈసారి గ్యాంగ్‌స్టర్ కథను ఎంచుకున్నారు. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటించడం మరో హైలెట్.
కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. 'భగవంత్ కేసరి' తర్వాత బాలయ్యతో ఆమెకు మరో సినిమా ఇది. కాజల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారనే టాక్ ఉన్నా, కథలో ఆమె పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందనేది ఇంకా బయటకు రాలేదు. మరోవైపు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సినిమాల్లో హీరో ఎలివేషన్లకు తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ఉపయోగపడిందో తెలిసిందే. ఈసారి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎలాంటి సౌండింగ్ సిద్ధం చేశారనేది చూడాలి.
షూటింగ్ పూర్తయినా వెంటనే సినిమా విడుదల చేసే పరిస్థితి లేదు. ఎడిటింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్, ఫైనల్ సౌండ్ మిక్సింగ్ పనులు మిగిలి ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌కు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ఆ తర్వాత సెన్సార్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలి. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఇప్పటికే కొన్ని పనులను షూటింగ్‌తో పాటే చేయిస్తున్నట్లు సమాచారం. నవంబర్ మొదటివారానికి మిగిలిన షూటింగ్‌పై క్లారిటీ వస్తే డిసెంబర్ రిలీజ్ ప్లాన్ కూడా ఒక కొలిక్కి రావచ్చు.
క్రిస్మస్ సెలవులు 'దాదా'కు మంచి అడ్వాంటేజ్. డిసెంబర్ 24 గురువారం కావడంతో నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ దొరుకుతుంది. అయితే అదే రోజుకు నాగార్జున 'కింగ్ 100' కూడా డేట్ ప్రకటించింది. మరుసటి రోజు కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పంపకాలు కూడా కీలకమే. బాలయ్య సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే సెంటర్లలో ఎక్కువ షోలు కేటాయించాల్సి ఉంటుంది. ఈ పోటీ మధ్య 'దాదా' విడుదల తేదీని మేకర్స్ ఎంతవరకు నిలబెట్టుకుంటారనేది చూడాలి.
