పడిన చోటే లేచేలా బాలయ్య ప్రయత్నం!
‘అఖండ 2’తో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన బాలకృష్ణ, ఈసారి అదే డిసెంబర్ సీజన్లో ‘దాదా’తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇప్పటికే ‘దాదా ధమాకా’ పాటకు మంచి స్పందన వచ్చింది. అయితే అదే రోజు నాగార్జున ‘కింగ్ 100’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కూడా విడుదల కానుండటంతో బాలయ్యకు గట్టి పోటీ ఎదురుకానుంది.
By: Srikanth Kontham | 16 Nov 2026 6:00 PM ISTఎక్కడైతే తడబడ్డామో? అక్కడే నిలబడి సత్తా చాటడం నందమూరి బాలకృష్ణ నైజం. తాజాగా బాక్సాఫీస్ వద్ద కూడా ఆయన అదే ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన `అఖండ 2` బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలవడంతో.. సరిగ్గా ఏడాది తిరిగేసరికి మళ్లీ అదే డిసెంబర్ సీజన్‌ను తన కొత్త సినిమా `దాదా`తో టార్గెట్ చేశారు బాలయ్య. పోయిన చోటే మళ్లీ వసూళ్ల వేట మొదలుపెట్టాలి అన్న కసితో సింహం క్రిస్మస్ బరిలోకి దిగుతుంది.
నిజానికి డిసెంబర్ నెల బాలయ్యకు `అఖండ` (2021) రూపంలో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించింది. కానీ గతేడాది డిసెంబర్ 12న వచ్చిన సీక్వెల్ `అఖండ 2: తాండవం` అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేక యావరేజ్ వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఆ నిరాశను చెరిపేస్తూ అదే నెలలో ఓ సాలిడ్ మాస్ హిట్ కొట్టాలని బాలకృష్ణ బలంగా ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే `వీరసింహారెడ్డి` వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి గ్యాంగ్‌స్టర్ డ్రామా `దాదా`ను డిసెంబర్ 24న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ `దాదా ధమాకా` మాస్ ఆడియన్స్‌లో మంచి జోష్ నింపింది. ఇందులో బాలయ్య స్వయంగా పాట పాడటంతో పాటు నర్గీస్ ఫక్రీతో వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తుండగా తమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. వాయిదా పడుతుందన్న ప్రచారానికి చెక్ పెడుతూ మేకర్స్ డిసెంబర్ 24 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
అయితే ఈసారి డిసెంబర్ బాక్సాఫీస్ బరి అంత సులభంగా లేదు. క్రిస్మస్ కానుకగా అదే రోజు నాగార్జున `కింగ్ 100`, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ `కింగ్` వంటి భారీ చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఇంత పోటీ మధ్య గతేడాది డిసెంబర్లో చేజారిన బాక్సాఫీస్ ఆధిపత్యాన్ని తిరిగి దక్కించుకోవడం బాలయ్యకు సవాలు లాంటిదే.
అయినా సింహం తగ్గేదేలే. `అఖండ 2` మిగిల్చిన అసంతృప్తిని `దాదా`తో తుడిచిపెట్టాలని బాలకృష్ణ- గోపీచంద్ ద్వయం పక్కా ప్రణాళికతో వస్తోంది. సరైన మాస్ కంటెంట్ పడితే డిసెంబర్ సెంటిమెంట్ బాలయ్యకు ఎలా కలిసొస్తుందో? గతంలోనే ప్రూవ్ అయింది. మరి ఈ క్రిస్మస్కు `దాదా` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించి బాలయ్యకు మళ్ళీ డిసెంబర్ విన్నర్ ట్యాగ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
