Begin typing your search above and press return to search.

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దాదా’ విడుదల తేదీపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానుంది. ఇందులో బాలయ్యను రొటీన్ మాస్ హీరోగా కాకుండా మెచ్యూర్డ్ మాఫియా డాన్‌గా చూపిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. థమన్ సంగీతం అందిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

By:  Sivaji Kontham   |   5 Nov 2026 1:23 PM IST
అన్ని పుకార్ల‌కు చెక్.. దాదా ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!
X

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఆలోచ‌న‌ల్లో వేగం, సినిమా ప‌ట్ల ఆయ‌న‌కున్న అంకిత‌భావం చూస్తుంటే సినీ పండితులు సైతం ఆశ్చ‌ర్యపోవాల్సిందే. ఇటీవల ఎదురైన చిన్నపాటి గాయాల్ని సైతం లెక్క చేయ‌కుండా, అత్యంత ప్ర‌ణాళికా బ‌ద్ధంగా షూటింగ్ పూర్తి చేసి.. అనుకున్న సమయానికే దాదా చిత్రాన్ని రిలీజ్ చేయించేలా, త‌న‌ తదుపరి పనుల్లో మునిగిపోయారు బాలయ్య. సోష‌ల్ మీడియాల్లో `దాదా` విడుదల వాయిదా పడుతోందంటూ వచ్చిన అన‌వ‌స‌ర పుకార్లన్నింటికీ చిత్ర‌బృందం కొట్టిపారేస్తూ క్లారిటీ ఇచ్చేసింది. సినిమా విడుదల వాయిదా ప్రసక్తే లేదని.. చెప్పిన టైముకే అంటే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా న‌ట‌సింహం థియేటర్ల బ‌రిలోకి దిగుతున్నారని ధీమా వ్యక్తం చేసింది. బాలయ్య కమిట్‌మెంట్‌తో పెట్టుకుంటే నిజంగా ద‌బిడి దిబిడే అని మరోసారి ప్రూవ్ కాబోతోందిట‌.

అయితే ఈ గ్రాండ్ రిలీజ్ అప్‌డేట్ ఎంత సంతోషాన్ని ఇస్తుందో.. మరోవైపు అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణను ఇందులో ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో శివ నిర్వాణ `ఇరుముడి`లో మాస్ మ‌హారాజా అంత‌టివాడినే ఎంతో షటిల్డ్‌గా, పరిణతి చెందిన ప్రశాంతమైన పాత్రలో ఆవిష్కరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మరి అదే బాటలో గోపీచంద్ మలినేని కూడా బాలయ్యను కేవలం ఒక రొటీన్ మాస్ హీరోగా కాకుండా.. క్యారెక్టర్ డెప్త్‌ ఉన్న పవర్ ఫుల్ మెచ్యూర్డ్‌ లుక్‌లో చూపిస్తాడా? లేక తన మార్కు రొటీన్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫార్ములాకే పరిమితమవుతాడా? అనే సందేహాల్ని లేవనెత్తుతున్నారు.

ప్రస్తుత పాన్-ఇండియా సినీ ప్రేక్షకుల ఆలోచనా విధానం అసాధార‌ణంగా మారింది. ఎంతటి గ్యాంగ్‌స్టర్ డ్రామా అయినా లేదా ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్ కథ అయినా.. అందులో లౌడ్ యాక్షన్ కంటే కథలోని గాంభీర్యం, పాత్రలోని ఔచిత్యం ముఖ్యం. అతిశయోక్తులు, లాజిక్‌కు అందని ఫైట్లు లేకుండా ప్రస్తుత ఆడియెన్స్ మైండ్ సెట్‌కి తగినట్లుగా రియలిస్టిక్ యాక్షన్ స్టంట్స్‌తో బాలయ్య పాత్రను డిజైన్ చేసి ఉంటార‌ని కూడా భావిస్తున్నారు. బాలయ్యలోని నట విశ్వరూపాన్ని స‌ద్వినియోగం చేస్తూనే ఆయన వయసుకు తగిన గాంభీర్యాన్ని జోడించిన మాఫియా డాన్ పాత్ర‌లో చూపిస్తున్నారా? పాన్-ఇండియన్ ఆడియన్ మనసుల్ని నేరుగా తాకే పాత్రగా ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోతుందా? అంటూ ఎవ‌రికి వారు ఊహాగానాలు సాగిస్తున్నారు.

సినిమా సాంకేతిక అంశాలు భేషుగ్గా ఉండేందుకు టీమ్ కృషి చేస్తోంది. నిర్మాణ పురోగతి కూడా అంతే వేగంగా సాగుతోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని నేతృత్వంలో ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.థమన్ ఈ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించే పనిలో ఉన్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా అలరించనుండగా.. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడవగా.. థియేట్రికల్ బిజినెస్ క్లోజింగ్ స్టేజ్‌కు చేరుకుంది.

క్రిస్మస్ రేసులో `దాదా` రాక ఖరారు కావడంతో డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద బాలయ్య మాస్ జాతర ఖాయంగా కనిపిస్తోంది. అయితే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఆధునిక ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా బాలకృష్ణను ఒక కొత్త కోణంలో పవర్‌ఫుల్ అండ్ మెచ్యూర్డ్ గ్యాంగ్‌స్టర్‌గా గోపీచంద్ మలినేని ప్రెజెంట్ చేస్తే మాత్రం థియేటర్లలో రికార్డుల వేట మొదలైనట్లేన‌నే విశ్లేష‌ణ సాగుతోంది. ఎన్బీకేని కింగ్ ఆఫ్ క‌యాస్ గా చూడాల‌ని అభిమానులు ఆరాట‌ప‌డుతున్నారు. ఆ మేర‌కు అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ఇక‌పై వరుస అప్‌డేట్స్‌తో రాబోతున్న `దాదా` ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.