అల్లు-నందమూరి బంధం.. ప్రీవిందులో బాలయ్య సందడే సందడి
అంతకుముందు నటసింహం బాలయ్య వేడుకకు రాగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు.
By: Sivaji Kontham | 3 March 2026 12:46 AM ISTఅల్లు ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అల్లు శిరీష్- నైనికల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఈ జంట ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకకు విచ్చేసిన బాలయ్య నూతన వధూవరులను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదించారు.
ఈ వేడుకలో బాలయ్య తనదైన శైలిలో సందడి చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు అరవింద్‌లతో కలిసి ఆయన చాలా సేపు ముచ్చటించారు. సరదాగా నవ్వుతూ, జోకులు వేస్తూ బాలకృష్ణ చేసిన హడావుడి అక్కడి అతిథులను కట్టిపడేసింది. అల్లు- నందమూరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ దృశ్యాలు మరోసారి చాటిచెప్పాయి.
అంతకుముందు నటసింహం బాలయ్య వేడుకకు రాగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్బీకేను సాదరంగా ఆహ్వానించి ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. బాబాయ్ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ బాలయ్య వెంటే ఉండి అల్లు అర్జున్ మర్యాదలు చేయడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ దిగ్గజ హీరోలతో పాటు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఈ వేడుకలో మెరిశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నిర్మాతలు అశ్వనీదత్, డివివి దానయ్య, కేఎస్ రామారావు వంటి ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలందరూ ఒకే చోట చేరడంతో అల్లు శిరీష్ రిసెప్షన్ వేదిక కళకళలాడిపోయింది.
పెళ్లి వేడుకల్లో భాగంగా నిన్న జరిగిన వరుడుని చేసే కార్యక్రమంలో కూడా సెలబ్రిటీల సందడి తారాస్థాయిలో ఉంది. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. అలాగే క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కూడా జంటగా కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. మొత్తానికి అల్లు వారి పెళ్లి సంబరాలు ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయని చెప్పవచ్చు.
ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. మార్చి 6వ తేదీన అల్లు శిరీష్ - నైనికల వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి ఆ శుభ ముహూర్తాన ఈ జంట ఒక్కటయ్యే అద్భుత దృశ్యాన్ని చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
