Begin typing your search above and press return to search.

నంది అవార్డుల క‌మిటీ ఛైర్మ‌న్‌గా NBK .. కొత్త ప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి!

తొమ్మిదేళ్ల విరామం తర్వాత నంది అవార్డుల పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ నవంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. అల్లు అరవింద్, ఎస్. గోపాల్ రెడ్డి, ప్రభ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 2017-2025 అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 2026 డిసెంబర్‌లో ప్రదానోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   27 Nov 2026 9:31 AM IST
నంది అవార్డుల క‌మిటీ ఛైర్మ‌న్‌గా NBK .. కొత్త ప‌రిశ్ర‌మ‌పైనా దృష్టి!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల పునరుద్ధరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంటూ.. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. నవంబర్ 26న ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. 2017 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులతో పాటు.. 2025 సంవత్సరానికి పూర్తిస్థాయి విభాగాల్లో అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి.. డిసెంబర్ 2026లోనే అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ నేతృత్వంలోని కమిటీలో నిర్మాత అల్లు అరవింద్, సినీ ప్రముఖుడు ఎస్. గోపాల్ రెడ్డి, సీనియర్ నటి ప్రభ సభ్యులుగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) మేనేజింగ్ డైరెక్టర్ ఈ కమిటీకి మెంబర్ కం కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి నంది అవార్డుల సందడి మొదలుకానుండటంతో తెలుగు సినీ, టెలివిజన్, నాటక రంగాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

దీనితో పాటు వేడుకల నిర్వహణకు ప్రత్యేకంగా అంతర్‌శాఖ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు..ప‌లు విభాగాల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. సినిమా, టెలివిజన్, నాటక, డాక్యుమెంటరీ, సినీ సాహిత్యం వంటి విభాగాల్లో అర్హులైన ప్రతిభను గుర్తించి సత్కరించేలా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ డివైడ్ త‌ర్వాత నంది అవార్డుల ఉత్స‌వం ర‌క‌ర‌కాల‌ ఆటంకాల‌తో నిలిచిపోవ‌డం నిజంగా క‌ళారంగానికి ఇబ్బందికం. అందుకే ఇప్పుడు తేదేపా ప్ర‌భుత్వం క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా ఈ నిర్ణ‌యాలు తీసుకుంటోంది. పుర‌స్కారాలు అందిస్తే ఇండ‌స్ట్రీలోను ఉత్సాహం పెరుగుతుంది. ఎన‌ర్జీ పుట్టుకొస్తుంది. ఇప్పుడు తేదేపా ప్ర‌భుత్వం చొర‌వ‌తో నంది పుర‌స్కారాలను పున‌రుద్ధ‌రించ‌డంపై టాలీవుడ్ లో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

నంది అవార్డుల పున‌రుద్ధ‌ర‌ణ‌తో పాటు ఏపీకి మిస్స‌యిన గ్లామ‌ర్ ని పెంచేందుకు అమ‌రావ‌తి లేదా విశాఖ‌లో ఒక స‌రికొత్త సినీప‌రిశ్ర‌మ రూప‌క‌ల్ప‌న‌కు సినీపెద్ద‌ల‌తో ప్ర‌భుత్వం మంత‌నాలు స‌మీక్షా స‌మావేశాలు సాగించేలా అగ్ర క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ కృషి చేయాల‌ని కూడా ఏపీ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. గ్లామ‌ర్ రంగంతో పాటు, పారిశ్రామిక‌ సాంకేతిక రంగం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉర‌క‌లెత్తాల‌ని ఆకాంక్షిస్తున్నారు.