టాలీవుడ్ డెవలప్మెంట్ లో ఏపీ కూడా.. బాలయ్య ఏమన్నారంటే?
టాలీవుడ్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది.
By: M Prashanth | 25 Jun 2026 5:31 PM ISTటాలీవుడ్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కూడా కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది. అమరావతిలో జరిగిన తన కొత్త సినిమా పూజా కార్యక్రమంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఏపీలో సినిమా షూటింగ్లకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్లు, పోలీస్ సెక్యూరిటీతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పడం ఆసక్తి రేపుతోంది.
బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమం అమరావతిలో గ్రాండ్ గా జరిగింది. ఆ సమయంలో మాట్లాడిన బాలకృష్ణ.. ఇది అమరావతిలో జరిగిన తొలి సినిమా పూజా కార్యక్రమమని, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన పెద్ద సినిమా ఇదేనని అన్నారు. అమరావతి అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
టాలీవుడ్ ను కేవలం ఒకే నగరానికి పరిమితం చేయకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నదే తన సినిమా లాంఛింగ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించిన ప్రధాన ఉద్దేశమని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన నేచురల్ షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయని, విశాఖపట్నం బీచ్ తో పాటు తీర ప్రాంతాల్లో లొకేషన్లు ఉన్నాయని గుర్తు చేశారు.
షూటింగ్స్ కోసం వచ్చే నిర్మాతలు, దర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన పోలీసు సెక్యూరిటీ కూడా కల్పిస్తామని బాలకృష్ణ తెలిపారు. షూటింగ్లకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా మరిన్ని సినిమాలు ఏపీలో తెరకెక్కే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఎవరిపైనా బలవంతం ఉండదని, ఎక్కడ షూటింగ్ చేయాలనేది పూర్తిగా నిర్మాతలు, దర్శకుల నిర్ణయమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందించే దిశగా ఆలోచిస్తోందని, దీంతో ఫ్యూచర్ లో మరిన్ని చిత్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు వరుసగా మూతపడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇలాంటి సమయంలో పరిశ్రమను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువేనని బాలకృష్ణ గుర్తు చేశారు. చాలా సినిమాల కలెక్షన్లలో సుమారు 70 శాతం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని, మిగతా 30 శాతం తెలంగాణ నుంచి వస్తోందని వివరించారు.
గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేదని, ఇప్పుడు అమరావతి కూడా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మహానటులు పుట్టిన నేల ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఈ నేలపై కూడా తెలుగు ఇండస్ట్రీలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. దీనిపై సినీ ప్రముఖులు, ప్రభుత్వంతో చర్చించి ముందుకు వెళ్లేలా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఏదేమైనా అమరావతిలో జరిగిన మూవీ లాంఛ్ ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ విస్తరణకు కొత్త సిగ్నల్స్ ఇచ్చిన వేదికగా నిలిచింది.
