అఖండ2కు ఆలస్యమదేనా?
సినిమా తర్వాత సినిమాను లైన్ లో పెట్టి వరుసగా వాటిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవంను చేస్తున్న విషయం తెలిసిందే
By: Sravani Lakshmi Srungarapu | 23 Aug 2025 1:44 PM ISTవరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. సినిమా తర్వాత సినిమాను లైన్ లో పెట్టి వరుసగా వాటిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ2 తాండవంను చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో..
ఇప్పటికే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి మరోటి బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. అఖండ2 పై ఆల్రెడీ భారీ అంచనాలున్న నేపథ్యంలో బోయపాటి కూడా ఈ సినిమాను ఆ అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా అఖండ2 నుంచి వచ్చిన గ్లింప్స్ ఆ అంచనాలను అందుకునేలా ఉండటంతో దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
వాయిదా దిశగా అఖండ2
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ చాన్నాళ్ల కిందటే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడీ సినిమా, మేకర్స్ ముందు చెప్పిన రోజుకు రాదని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుందని, సినిమా సెప్టెంబర్ నుంచి వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.
అఖండకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇంకా చెప్పాలంటే అఖండను మించి అఖండ2 ఉండేలా చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారని, అందుకే రిలీజ్ ఆలస్యమవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ నుంచి వాయిదా పడుతుందా లేదా అనేది మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
