పవన్ తో పోటీ ఖాయమే..!
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అఖండ2పై భారీ అంచనాలున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 8 Aug 2025 12:13 PM ISTనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ2 తాండవం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలూ హ్యాట్రిక్ హిట్స్ ను అందుకున్నాయనే సంగతి అందరికీ తెలుసు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అఖండ2పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 25న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కారణంగా చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను శరవేగంగా జరుపుతుంది.
డబ్బింగ్ ను పూర్తి చేసిన బాలయ్య
అందులో భాగంగానే ముందుగా డబ్బింగ్ ను పూర్తి చేస్తున్నారు. అఖండ2 లో బాలయ్య తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో బోయపాటితో కలిసి బాలయ్య డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. ఫోటో చూస్తుంటే డబ్బింగ్ పూర్తైన తర్వాత తీసుకున్న ఫోటోలా అనిపిస్తుంది.
నాలుగోసారి అంచనాలను మించి..
నాలుగోసారి బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ2 సినిమా మరింత మాస్ గా, అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే మొన్నటివరకు సెప్టెంబర్ 25న అఖండ2 రిలీజవుతుందా లేదా వాయిదా పడుతుందా అని అనుమానాలున్నాయి. కానీ ఇప్పుడు బాలయ్య డబ్బింగ్ పూర్తి చేయడం చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేసేలా కనిపిస్తున్నారు.
తగ్గేదేలే అంటున్న సీనియర్ హీరోలు
కాగా అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రెండూ పెద్ద సినిమాలు కావడంతో ఈ రెండింట్లో ఏదొక సినిమా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు కానీ పరిస్థితులు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
