Begin typing your search above and press return to search.

అఖండ 2.. నెక్స్ట్ ఏంటి?

అయితే అసలు అఖండ 2 విషయంలో నెక్స్ట్ ఏంటి అని ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు.

By:  M Prashanth   |   6 Dec 2025 8:29 PM IST
అఖండ 2.. నెక్స్ట్ ఏంటి?
X

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చే. ఎందుకంటే బాలయ్య కెరీర్ లోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవడంతో చివరి నిమిషంలో అఖండ-2 విడుదల వాయిదా పడింది.

దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అభిమానులు తీవ్రంగా నిరాశ పడ్డారు. ఏంటి ఇలా జరిగింది.. మూవీ కోసం ఎంతో వెయిట్ చేశామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గందరగోళంలో పడిపోయారు. ఎందుకంటే రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయిన వేళ.. వాయిదా పడడంతో ఏం చేయలేక తెలియక కంగారుపడ్డారు.

అఖండ 2 సందడి డిసెంబర్ 4వ తేదీన ప్రీమియర్స్ తో మొదలవ్వాల్సి ఉండగా.. వాయిదా పడింది కదా.. అయితే డిసెంబర్ 5వ తేదీన ప్రీమియర్స్ పడతాయని కొందరు ఎక్స్పెక్ట్ చేశారు. శనివారం అయినా సినిమా వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని నిర్మాతలు వెల్లడించారు. త్వరలో బ్లాక్ బస్టర్ డేట్ తో వస్తామని చెప్పారు. కానీ రిలీజ్ డేట్ ను మాత్రం వెల్లడించలేదు.

అయితే అసలు అఖండ 2 విషయంలో నెక్స్ట్ ఏంటి అని ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. మేకర్స్.. మరికొన్ని గంటల్లో అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో రిలీజ్ డేట్ పై ప్రకటన స్పష్టంగా ఇవ్వాలంటే.. ముందు విడుదలపై స్టే కోర్టు ఎత్తివేయాలి. ఎందుకంటే మద్రాసు హైకోర్టు ఆదేశాల వల్లే సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్.. తమకు రావాల్సిన బకాయిలు విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది.

అయితే అఖండ 2 విడుదల భవితవ్యం ఇప్పుడు చెన్నైలోని దిగువ కోర్టు చేతుల్లో ఉంది. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు విడుదలపై స్టే ఇచ్చాక.. కేసును తిరిగి దిగువ కోర్టుకు పంపింది. కానీ ఆ ఉత్తర్వులపై న్యాయమూర్తి శుక్రవారం రాత్రి వరకు సంతకం చేయలేదు. దీంతో కేసు సోమవారం వరకు వాయిదా పడింది. డిసెంబర్ 8వ తేదీన విచారణ జరగనుంది.

ఆ రోజు ఈరోస్ సంస్థ.. 14 రీల్స్ ప్లస్ బకాయిలు చెల్లించిందని చెబితే కోర్టు రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే అఖండ 2 నిర్మాణ సంస్థ.. బకాయిలను చెల్లించేసిందని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా పలువురి సమన్వయంతో చేసినట్లు వినికిడి. ఏదేమైనా కోర్టులో ఇష్యూ ఉండడంతో త్వరతగతిన మేకర్స్.. చర్యలు తీసుకున్నట్లు టాక్. ఏదేమైనా సోమవారం కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో వేచి చూడాలి.