Begin typing your search above and press return to search.

అప్పటి బాలయ్య రికార్డు.. ఇప్పటి హీరోలకు ఎందుకు సాధ్యం కాదు?

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఒకప్పుడు క‌లెక్ష‌న్లు, తర్వాత థియేటర్ల సంఖ్య, ఆపై ఫస్ట్ వీక్ కలెక్షన్లు, ఇప్పుడు ఓటీటీ వ్యూస్, డిజిటల్ బిజినెస్.. ఇలా రికార్డులను కొలిచే ప్రమాణాలే మారిపోయాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   24 Sept 2026 4:00 AM IST
అప్పటి బాలయ్య రికార్డు.. ఇప్పటి హీరోలకు ఎందుకు సాధ్యం కాదు?
X

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఒకప్పుడు క‌లెక్ష‌న్లు, తర్వాత థియేటర్ల సంఖ్య, ఆపై ఫస్ట్ వీక్ కలెక్షన్లు, ఇప్పుడు ఓటీటీ వ్యూస్, డిజిటల్ బిజినెస్.. ఇలా రికార్డులను కొలిచే ప్రమాణాలే మారిపోయాయి. అయితే నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 1986కు దక్కిన ప్రత్యేకత మాత్రం ఇప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. ఒకే క్యాలెండ‌ర్ ఇయర్‌లో ఆరు సినిమాలు శతదినోత్సవాలు జరుపుకోవడం వెనుక కేవలం 100 రోజుల రన్ మాత్రమే లేదు. ఆ కాలం నాటి సినిమా మార్కెట్ స్వభావం, ప్రేక్షకుల థియేటర్ అలవాట్లు, స్టార్ హీరోలపై ఉన్న నమ్మకం కూడా కీలక పాత్ర పోషించాయి.

1986లో బాలయ్య నటించిన సినిమాలను గమనిస్తే మరో ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తుంది. ఒకే తరహా కథలు లేదా ఒకే ఇమేజ్‌ను నమ్ముకుని ఆయన వరుసగా సినిమాలు చేయలేదు. ముద్దుల కృష్ణయ్యలో పల్లెటూరి నేపథ్యం, అనసూయమ్మ గారి అల్లుడులో మాస్ టచ్, దేశోద్ధారకుడులో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్, కలియుగ కృష్ణుడులో కొత్త తరహా ఎలిమెంట్స్, అపూర్వ సహోదరులులో ద్విపాత్రాభినయం.. ఇలా ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపించింది. ఈ వైవిధ్యమే అప్పటి ప్రేక్షకుల్లో బాలయ్యపై ఏర్పడిన క్రేజ్‌ను మరింత బలపరిచింది.

ముఖ్యంగా అప్పటి థియేటర్ కల్చర్‌ను ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సినిమా రిలీజైన తర్వాత వారాలు, నెలల పాటు అదే థియేటర్‌లో ర‌న్ అవుతూ ఉండ‌ట‌మ‌నేది చాలా కామ‌న్ గా క‌నిపించేది. ఆడియ‌న్స్ కూడా తమకు నచ్చిన సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు థియేటర్లకు వెళ్లేవారు. ఫ్యాన్ బేస్ ఉన్న హీరో సినిమాకు ఎక్కువ షోలు, ఎక్కువ రోజులు దొరికే అవకాశం ఉండేది. దీంతో సినిమా స‌క్సెస్‌ను 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు వంటి మైలురాళ్లతో కొలవడం అప్పటి బాక్సాఫీస్ సంస్కృతిలో భాగమైంది.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీప్లెక్స్‌ల పెరుగుదల, అనేక స్క్రీన్లలో ఒకేసారి రిలీజ్, వీకెండ్ కలెక్షన్లపై పెరిగిన దృష్టి, ఓటీటీ మరియు ఇతర డిజిటల్ రైట్స్ ప్రాధాన్యం కారణంగా థియేట్రికల్ రన్ స్వరూపమే మారింది. దానికి తోడు ఆడియ‌న్స్ ఎంట‌ర్టైన్మెంట్ అలవాట్లు కూడా మారడంతో ఒక సినిమాను నెలల తరబడి థియేటర్‌లో కొనసాగించాల్సిన అవసరం తగ్గింది. మంచి రెస్పాన్స్ వచ్చినా కొద్ది రోజుల్లోనే కొత్త సినిమా కోసం స్క్రీన్లు మార్చడం ఇప్పుడు సాధారణంగా మారింది.

అందుకే బాలయ్య 1986 రికార్డును కేవలం ఆరు సినిమాలు 100 రోజులు ఆడాయి అనే దానిలా చూడటం కంటే, అప్ప‌టి ప‌రిస్థితుల‌ని అర్థం చేసుకోవడం మరింత ఆసక్తికరం. అప్పటి స్టార్ హీరో మార్కెట్, ప్రేక్షకుల థియేటర్ అనుభవం, సినిమాల మధ్య ఉన్న వైవిధ్యం, దీర్ఘకాలిక థియేట్రికల్ రన్.. ఇవన్నీ కలిసిన ఫలితంగా ఆ రికార్డు నిలిచిపోయింది. సినిమా స‌క్సెస్ ను కొలిచే విధానం మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఫార్మాట్‌లో అలాంటి రికార్డు రిపీట్ కావడం కష్టంగా కనిపించడానికి అసలు కారణం ఇదే.