ఎల్లమ్మ.. యాక్షన్ సంగతేంటి?
ముఖ్యంగా ఎల్లమ్మ జాతర అనగానే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే పోతురాజుల విన్యాసాలు, బలులు, ఊరేగింపులు గుర్తుకొస్తాయి.
By: M Prashanth | 3 Nov 2026 9:30 AM ISTఈమధ్య సినిమాల్లో ఊచకోత ఏ రేంజ్లో ఉంటోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కత్తిపోట్లు, తలకాయలు ఎగిరిపోయేలా నరకడం, రక్తం ఏరులై పారడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు విలన్‌ను కొట్టడానికే హీరోకు భారీ ఎలివేషన్లు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఎంత దారుణంగా నరికితే అంత మాస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇలాంటి టైమ్‌లో 'బలగం' వేణు తెరకెక్కిస్తున్న 'ఎల్లమ్మ' కూడా రా అండ్ రస్టిక్ కథతో రాబోతోంది. మరి ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఏ స్థాయిలో ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
'బలగం'లో ఒక్క ఫైట్ కూడా లేకుండా ప్రేక్షకులను కంటతడి పెట్టించిన వేణు ఈసారి పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, ఎల్లమ్మ జాతర, అక్కడి మనుషుల నమ్మకాలు ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో భక్తి, ఆచారాలు, హెవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తరహా అంశాలను చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ పర్షి అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్ కూడా రెగ్యులర్ కమర్షియల్ హీరోలా కాకుండా పల్లెటూరి వ్యక్తిని గుర్తుచేస్తోంది. అయితే జాతర నేపథ్యంలో కథ నడుస్తుండటంతో భారీ సంఘర్షణలకు కూడా అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా ఎల్లమ్మ జాతర అనగానే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే పోతురాజుల విన్యాసాలు, బలులు, ఊరేగింపులు గుర్తుకొస్తాయి. అలాంటి వాతావరణంలో జరిగే కథకు రస్టిక్ టచ్ ఇవ్వడం కష్టమేమీ కాదు. కానీ దాన్ని తెరపై ఎంత వయొలెంట్‌గా చూపిస్తారనేదే ప్రశ్న. ఈమధ్య కొన్ని సినిమాల్లో కథ కంటే హీరో చేసే ఊచకోతకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆ సన్నివేశాలకు సరైన కారణం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లేదంటే ఎంత భారీగా తీసినా సోషల్ మీడియాలో ట్రోల్స్ తప్పడం లేదు.
ముఖ్యంగా రక్తపాతం ఎక్కువగా ఉన్నా కథలో ఎమోషన్ సరిగ్గా కుదరకపోతే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలతో కనిపించింది. ఇప్పుడు 'ఎల్లమ్మ' విషయంలోనూ అలాంటి రిస్క్ లేకుండా వేణు ఎంత జాగ్రత్త పడతారనేది ఆసక్తికరం. అయితే వేణు గత సినిమా చూసినవాళ్లకు ఆయన కథ చెప్పే విధానంపై ఒక అంచనా ఉంది. 'బలగం'లో చిన్నచిన్న కుటుంబ గొడవలు, పల్లెటూరి సంప్రదాయాలతోనే బలమైన ఎమోషన్ పండించారు.
ఇప్పుడు అదే దర్శకుడు జాతర నేపథ్యంలో పెద్ద కథను ఎంచుకోవడంతో ఆ ఎమోషన్స్‌కు యాక్షన్ కూడా తోడవుతుందనే టాక్ ఉంది. పైగా ఈసారి దేవిశ్రీ ప్రసాద్‌ను హీరోగా తీసుకోవడం మరో ప్రయోగం. రెగ్యులర్ మాస్ హీరోల మాదిరిగా ఆయనతో భారీ ఫైట్స్ చేయిస్తారా, లేక పాత్రకు తగ్గట్లుగా యాక్షన్‌ను డిజైన్ చేస్తారా అనేది చూడాలి.
వచ్చే ఏడాది మార్చి 5న ఐదు భాషల్లో 'ఎల్లమ్మ' విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ఎల్లమ్మ పాట కోసం దేశవ్యాప్తంగా వందమంది జానపద వాయిద్య కళాకారులతో రికార్డింగ్ చేయడం విశేషం. దీంతో జాతర వాతావరణానికి సంగీతం ద్వారా భారీ స్థాయిలో హైప్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఆ హంగామాకు తగ్గట్లుగా సినిమాలో యాక్షన్ కూడా ఉంటుందా, లేక 'బలగం' తరహాలో ఎమోషన్స్‌కే వేణు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారా అనేది నెక్స్ట్ అప్డేట్స్ తో క్లారిటీ రావచ్చు.
