'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీ రివ్యూ
ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా నాగశౌర్య కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి.
By: Prakash Chimmala | 17 April 2026 6:00 PM IST‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీ రివ్యూ
నటీనటులు: నాగశౌర్య- విధి యాదవ్ - శ్రీదేవి విజయ్ కుమార్ - సముద్రఖని - సాయికుమార్ - నరేష్ - వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి- విజయ్ కుమార్ చింతలపూడి- అశోక్ కుమార్ చింతలపూడి
స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రామ్ దేశిన
ఒకప్పుడు ‘ఛలో’ సహా కొన్ని మంచి విజయాలందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. హిట్టు ముఖం చూసి చాలా ఏళ్లయింది. ‘రంగబలి’ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అతను.. ఇప్పుడు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రమైనా నాగశౌర్య కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి.
కథ:
కార్తీక్ (నాగశౌర్య)కు లాయర్ అయిన తన అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. తల్లిదండ్రులు లేకపోయినా అన్నీ తానై చూసుకున్న అక్కకు ఏ చిన్న కష్టం వచ్చినా కార్తీక్ తట్టుకోలేడు. తెర వెనుక ఉండి ఆమెకు ఏ ఇబ్బందీ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటిది తన అక్కను ఎవరో చంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి.. వాళ్ల సంగతేంటో తేల్చడానికి సిద్ధమవుతాడు కార్తీక్. ఈ క్రమంలోనే కదిరికి వస్తాడు. ఆ ప్రాంతానికే చెందిన రాజకీయ నాయకుడు గోవిందప్ప (మీమ్ గోపి)నే తన అక్కను టార్గెట్ చేశాడని తెెలుసుకుని అతణ్ని కస్తూరి కళ్ల ముందే చంపేస్తాడు కార్తీక్. ఐతే కదిరికే చెందిన మరో రాజకీయ నాయకుడు వరదా రెడ్డి (సముద్రఖని) రూపంలో కస్తూరి కి ఇంకా పెద్ద ముప్పు పొంచి ఉందని కార్తీక్ తెలుసుకుంటాడు. ఇంతకీ గోవిందప్ప-వరదారెడ్డిలతో కస్తూరికి ఉన్న గొడవేంటి.. ఈ ఇద్దరి నేపథ్యం ఏంటి.. గతం తెలిశాక కార్తీక్ ఏం చేశాడు.. తన అక్కను ఎలా కాపాడుకున్నాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
హీరో-అతడి అక్క మార్కెట్లో ఉంటారు. అంతలో రౌడీలు ఎటాక్ చేయబోతారు. ఆ సంగతి హీరో కనిపెడతాడు. కానీ తన అక్కకు గొడవలంటే ఇష్టం ఉండదు. మరి హీరో ఏం చేస్తాడు? అక్క వెనుకే నడుస్తూ ఒక్కో రౌడీ అంతు చూస్తాడు. తన వెనుక ఎంతో విధ్వంసం జరుగుతున్నా.. అక్కకు మాత్రం ఏమీ తెలియకుండా మేనేజ్ చేస్తాడు హీరో. 16 ఏళ్ల ముందు ‘డార్లింగ్’ సినిమాలో ప్రభాస్ ఇలాంటి ఫైటే చేసినపుడు కూడా అదేమంత కొత్తగా అనిపించలేదు మరి. ఎందుకంటే అంతకుముందు ఎన్నో ఏళ్ల నుంచే ఇలాంటి ఫైట్లు చూస్తూ ఉన్నాం కాబట్టి. అలాంటిది 2026లో ఇలాంటి ఒక ఫైట్ పెట్టి దానికి బీజీఎంతో ఇచ్చిన బిల్డప్ చూస్తే.. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మేకర్స్ ఏ కాలంలో ఉన్నారో అనిపిస్తుంది. ‘బ్యాడ్ బాయ్’ ఔట్ డేట్ ఫీలింగ్ కలిగించడంలో ఈ ఒక్క ఫైటుకు పరిమితం కాలేదు. తొలి నిమిషం నుంచి చివరి వరకు ఆ ‘ఔట్ డేటెడ్’ వాసనలు గుప్పుమని కొడుతూనే ఉంటాయి. ఓ 20 ఏళ్ల ముందు తీస్తే ఏమైనా వర్కవుట్ అయ్యేదేమో కానీ.. ఈ రోజుల్లో ఇలాంటి కథా కథనాలతో సినిమా తీసి మెప్పించవచ్చనుకున్న మేకర్స్ ధైర్యాన్ని చూసి ఏమనుకోవాలో అర్థం కాదు.
నాగశౌర్య చివరి సినిమా ‘రంగబలి’ మూడేళ్ల ముందు వచ్చింది. అతను ఆ తర్వాత మొదలుపెట్టిన సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగశౌర్య లుక్ చూసి.. ఈ సినిమాలో తన లుక్ ను పోల్చి చూస్తే పొంతన ఉండదు. దాన్ని బట్టి ఇది అతను ఎప్పుడో పూర్తి చేసిన సినిమా అని అర్థమైపోతుంది. ఔట్ పుట్ అంత ఘోరంగా తయారైంది మరి. సినిమా పూర్తి చేయడం తన బాధ్యత కాబట్టి శౌర్య ఆ పని పూర్తి చేసినట్లున్నాడు కానీ.. చేస్తున్నపుడే అతడకి ఫలితం ఏంటో అర్థమైపోయినట్లుంది. ఎన్నడూ లేనంత మొక్కుబడిగా.. అన్యమనస్కంగా నటించాడు. అసలు శౌర్య లాంటి క్లాస్ హీరో అసలిలాంటి సబ్జెక్టును ఎందుకు ఓకే చేశాడన్నదే అర్థం కాని విషయం. టాలీవుడ్ మాస్ హీరోలు దశాబ్దాల ముందు చేసిన యాక్షన్ విన్యాసాలను అతను ఇందులో ట్రై చేశాడు. ‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్ లాగా ముఖానికి పసుపు రాసుకుని విలన్ తల నరికాడు. ‘మిర్చి’లో ప్రభాస్ మాదిరి ముఖానికి గుడ్డ చుట్టుకుని రౌడీల మీద మెరుపు దాడి చేశాడు. అందులో మాదిరే విలన్ కు ముఖం చూపించకుండా వెనుక నుంచి పట్టుకుని అతడికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా తనకు ఏమాత్రం నప్పని ఎన్నెన్నో మాస్-యాక్షన్ విన్యాసాలు చేశాడు శౌర్య. ప్రతి సన్నివేశం ఎక్కడో చూసినట్లు.. ఎవరినో అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప.. ఎక్కడా ఒరిజినాలిటీ అన్నదే కనిపించదు.
అనగనగా ఒక ఊరు.. అక్కడ అరాచకం చేసే విలన్లు.. తమకు అడ్డు చెప్పిన వాళ్లందరి అంతు చూస్తుంటారు. అలాంటప్పుడు హీరో రంగంలోకి దిగి తాను రక్షకుడిగా మారి విలన్ల అంతు చూస్తాడు. కొన్ని వందల సినిమాల్లో చూసిన సగటు మాస్ సినిమాల ఫార్ములాలోనే ఈ కథను నడిపించారు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో. హీరోయిన్ వెంటపడి అల్లరి చేస్తాడు కాబట్టి.. తన అక్కకు ఇష్టం లేకుండా వయొలెంట్ గా ప్రవర్తిస్తాడు కాబట్టి హీరోను ‘బ్యాడ్ బాయ్’ అన్నట్లున్నారు తప్ప అలాంటి టైటిల్ పెట్టడంలో విశిష్ఠత ఏమీ లేదు. శౌర్యను ఎంతో ఇష్టపడేవాళ్లు కూడా ఈ సినిమా చూశారంటే వామ్మో అనుకుంటారు. హారిస్ జైరాజ్ లాంటి లెజెండరీ సంగీత దర్శకుడు కూడా చాలా మొక్కుబడిగా పాటలు.. బీజీఎం లాగించేశాడంటే ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఎంత బ్యాడ్ మూవీనో అర్థం చేసుకోవచ్చు.
నటీనటులు:
క్లాస్ ఇమేజ్ ఉన్న హీరోలు మాస్ సినిమాలు ట్రై చేయడం కొత్తేమీ కాదు. కానీ నాగశౌర్య మీద మరీ ఇంత మాస్ ఏమాత్రం సూట్ కాదు. అందులోనూ మాస్ అనగానే ఇంత ఔట్ డేటెడ్ కథ ట్రై చేయడం ఏంటో? వినగానే ఔట్ రైట్ గా రిజెక్ట్ చేయాల్సిన కథ ఇది. దీన్ని ఓకే చేశాడంటే నాగశౌర్య జడ్జిమెంట్ ఎంత దెబ్బ తినేసిందో అర్థం చేసుకోవచ్చు. శౌర్య లుక్ వరకు బాగుంది కానీ.. పెర్ఫామెన్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. హీరోయిన్ విధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందంగానూ లేదు. అభినయమూ ఆకట్టుకోదు. ఆమెతో పోలిస్తే హీరో అక్క పాత్రలో కనిపించిన శ్రీదేవి విజయ్ కుమార్ బెటర్. ఆమె వరకు బాగా నటించింది. సముద్రఖని.. మీమ్ గోపి.. సాయికుమార్.. జాన్ విజయ్.. అజయ్.. ఇలా పేరున్న నటులు చాలామంది ఉన్నారు కానీ.. ఎవరికీ సరైన పాత్ర పడలేదు. పెర్పామెన్సులూ అంతంతమాత్రమే. విపరీతంగా హింసపెట్టే సినిమాలో వెన్నెల కిషోర్ కొంత రిలీఫ్ ఇచ్చాడు. అతను చేసింది కూడా గొప్ప కామెడీ ఏమీ కాదు కానీ.. ఇలాంటి సినిమాలో అదే పెద్ద ఉపశమనం.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాకు హారిస్ జైరాజ్ పనిశాడు అంటే నమ్మశక్యంగా అనిపించదు. చిన్న పాటలోనూ తన ముద్రను చూపించే హారిస్.. ఈ సినిమాకు పర్వాలేదు అనిపించే పాట ఒక్కటీ ఇవ్వలేదు. కంటెంట్ ను బట్టి అతను ఇలాంటి సాంగ్స్ ఇచ్చాడా లేక.. ఎవరో చేసిన పాటకు ఆయన పేరు వేశారా అన్నది అనుమానం. బీజీఎం సైతం అంతంతమాత్రమే. కదిరిలో జాతర సీన్ల వరకు కెమెరా పనితనం బాగుంది. నిర్మాతలు సినిమా మీద బాగా ఖర్చు పెట్టారు కానీ.. ఫలితం లేకపోయింది. రచన-దర్శకత్వ విభాగాల గురించి చెప్పడానికి ఏమీ లేదు. దర్శకుడిగా రమేష్ అని పేరు వేశారు కానీ.. అతను కూడా ఈ సినిమాను ఓన్ చేసుకోలేదు. మధ్యలో అతను వదిలేస్తే ఇంకెవరో సినిమాను పూర్తి చేసినట్లు యూనిట్ వర్గాల సమాచారం. కాబట్టి ఇలాంటి సినిమా తీసిన క్రెడిట్ ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి.
చివరగా: బ్యాడ్ బాయ్ కార్తీక్.. వెరీ బ్యాడ్
రేటింగ్- 1.5/5
