Begin typing your search above and press return to search.

దృశ్యం × ఇరుముడి.. ఇద్దరు ఇద్దరే..

సినిమాల్లో హీరో కూతురి పాత్ర చిన్నదే అయినా, కొన్ని సినిమాల్లో మాత్రం ఆ చిన్నారే కథకు పెద్ద బలం అవుతుంది.

By:  M Prashanth   |   25 Aug 2026 9:00 AM IST
దృశ్యం × ఇరుముడి.. ఇద్దరు ఇద్దరే..
X

సినిమాల్లో హీరో కూతురి పాత్ర చిన్నదే అయినా, కొన్ని సినిమాల్లో మాత్రం ఆ చిన్నారే కథకు పెద్ద బలం అవుతుంది. ‘దృశ్యం’లో వెంకటేష్ చిన్న కూతురిగా కనిపించిన ఎస్తర్ అనిల్ అప్పట్లో అలా గుర్తుండిపోయింది. ఇప్పుడు ‘ఇరుముడి’లో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర కూడా అదే తరహాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇద్దరూ మలయాళం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన చిన్నారులే కావడం మరో కనెక్షన్.

ఎస్తర్ అనిల్ ముందుగా మలయాళ ‘దృశ్యం’లో మోహన్‌లాల్ చిన్న కూతురిగా నటించింది. అదే పాత్రను తెలుగు ‘దృశ్యం’లో వెంకటేష్ పక్కన కూడా చేసింది. తర్వాత తమిళ వెర్షన్ ‘పాపనాశం’లో కమల్ హాసన్ కూతురిగానూ కనిపించింది. అంటే ఒకే పాత్రతో మూడు భాషల్లో పెద్ద హీరోల పక్కన నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది.

తర్వాత ఎస్తర్ చైల్డ్ ఆర్టిస్ట్ దశ నుంచి బయటకు వచ్చి హీరోయిన్‌గా కూడా ప్రయత్నించింది. తెలుగులో ‘జోహార్’లో లీడ్ రోల్ చేసింది. తమిళంలో కూడా హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. కానీ ‘దృశ్యం పాప’గా వచ్చిన స్థాయి క్రేజ్ మాత్రం హీరోయిన్‌గా ఇంకా దక్కలేదు. సినిమాలతో పాటు చదువుపై కూడా ఫోకస్ పెట్టి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువు పూర్తి చేసింది.

ఇప్పుడు నక్షత్రకు ‘ఇరుముడి’ అలాంటి మంచి గుర్తింపే ఇచ్చింది. సినిమాలో రవితేజ కూతురిగా ఆమె పాత్ర ఎమోషన్‌కు చాలా కీలకం. సినిమా మీద వచ్చిన రెస్పాన్స్ లో కూడా ఈ ట్రాక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. రవితేజ లాంటి మాస్ హీరో పక్కన చిన్నారి పాత్ర ఒక ఎమోషన్ తో హైలెట్ అవ్వడం చిన్న విషయం కాదు. ఇక్కడినుంచి నక్షత్ర కెరీర్ ఎలా వెళ్తుందో చూడాలి. వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తుందా, మలయాళం తెలుగు సినిమాల్లో బిజీ అవుతుందా అనేది ఒక దారి.

లేదంటే కొన్నేళ్ల తర్వాత ఎస్తర్‌లాగే హీరోయిన్‌గా తిరిగి రావచ్చు. చిన్నప్పుడే ఒక పెద్ద హిట్‌లో గుర్తుండిపోయిన ముఖం కాబట్టి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. ఎస్తర్‌కు ‘దృశ్యం’ ఒక జీవిత కాలం క్రేజ్ ఇచ్చింది. నక్షత్రకు ‘ఇరుముడి’ కూడా అలాంటి మొదటి పెద్ద గుర్తింపుగా నిలిచింది. ఇద్దరి తర్వాతి ప్రయాణాలు మాత్రం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ఎస్తర్ హీరోయిన్‌గా మారినట్టు నక్షత్ర కూడా కొన్నేళ్ల తర్వాత కొత్త అవతారంలో కనిపిస్తే తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆ కనెక్షన్ వెంటనే గుర్తొస్తుంది.