బంపర్ ఆఫర్ కొట్టేసిన రవితేజ కూతురు!
నక్షత్ర గురించి, నక్షత్ర తల్లి గురించి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. నేను నక్షత్ర పర్మిషన్ తోనే ఈ వేదికపై మాట్లాడుతున్నాను.
By: Madhu Reddy | 25 Aug 2026 9:40 AM ISTమాస్ మహారాజా రవితేజ చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూడగా.. ఎట్టకేలకు ఇరుముడి రూపంలో ఆయనకు మంచి బ్లాక్ బస్టర్ లభించింది. హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజకు ఇన్నాళ్లకు మంచి సక్సెస్ లభించడంతో ఆయన ఆనందంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం సోమవారం హైదరాబాదులో ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ పేరిట ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఈ సందర్భంగా ఎంతోమంది సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకోగా.. అందులో బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన కామెంట్లు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఈమెకు ఇచ్చిన బంపర్ ఆఫర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బంపర్ ఆఫర్ కొట్టేసిన ఇరుముడి బేబీ నక్షత్ర..
రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా, బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా నటించిన చిత్రం ఇరుముడి. బేబీ నక్షత్ర ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా సోల్ లో ఒకరిగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. అలాంటి ఈమె ఇటు ప్రెస్ మీట్ వేదికపై తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కూడా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే..
అద్భుతమైన అవకాశం కల్పించిన మైత్రి మేకర్ రవిశంకర్..
ఇదే వేదికపై ఇరుముడి మూవీ మేకర్స్ 'మైత్రి మూవీ మేకర్స్' నిర్మాతలలో ఒకరైన ప్రముఖ నిర్మాత రవిశంకర్ స్టేజ్ పై మాట్లాడుతూ. రవితేజ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్రకి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. "భవిష్యత్తులో నక్షత్ర హీరోయిన్ అవ్వాలని కోరుకుంటే.. ఆమెకు ఆ ఆలోచన ఉంటే.. తనను మా కూతురిగా భావించి, హీరోయిన్గా ఆమెను ఇండస్ట్రీకి లాంచ్ చేస్తాం. ఆమె పేరులోనే స్టార్ ఉంది. అద్భుతంగా నటించింది" అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు నిర్మాత రవిశంకర్. మొత్తానికైతే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇరగదీసేసిన ఈమెకు హీరోయిన్గా ఇంట్రెస్ట్ ఉంటే తమ బ్యానర్ ద్వారానే లాంచ్ చేస్తామని ప్రకటించడం నిజంగా నక్షత్ర అందుకున్న అతిపెద్ద బంపర్ ఆఫర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమ కూతురిలా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో మైత్రి మేకర్స్ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
తండ్రి లేకపోయినా అన్నీ తానై..
నక్షత్ర గురించి, నక్షత్ర తల్లి గురించి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. నేను నక్షత్ర పర్మిషన్ తోనే ఈ వేదికపై మాట్లాడుతున్నాను. సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలని, ధైర్యంగా పెంచాలని చెబుతూ ఉంటాం కదా.. అయితే నక్షత్ర లాంటి ధైర్యం, గట్టి గుండె ఉన్న చిన్నారిని నేను ఇంతవరకు చూడలేదు . షూటింగ్ ప్రారంభించినప్పుడు నక్షత్రకు తెలుగు విషయంలో చాలా భయం ఉండేది. తప్పులు వస్తాయేమో అని ఇబ్బంది పడింది. తెలుగు, మలయాళం రెండు తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను ఆమెతో ఉంచి ప్రతి విషయాన్ని రెండు భాషల్లో వివరించేలా చేశాను. నక్షత్ర చిన్నచిన్నగా తెలుగు నేర్చుకొని సులభంగా డైలాగ్స్ చెప్పడం ప్రారంభించింది.
సినిమాకి ఆ 20 నిమిషాలే కీలకం..
ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. మీ తండ్రిని ఊహించుకొని చెయ్యి అని నేను కొన్ని ఎమోషనల్ సీన్స్ గురించి చెబితే.. దానికి నక్షత్ర నాకు తండ్రి లేరు అని చెప్పింది. ఆ క్షణం ఊహించుకోలేకపోయాము. ఇక నక్షత్రకు తండ్రి గుర్తొచ్చి మరింత బాధపడుతుందని భావించి.. పర్లేదు సందర్భాన్ని ఇమేజిన్ చేసి.. నువ్వు ఎంత ఎమోషన్ తీసుకురాగలవో అంత తీసుకురా అని చెప్పాము. కానీ క్లైమాక్స్ లో నక్షత్ర అద్భుతంగా నటించింది. చివరి 20 నిమిషాల్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు కూడా తెలుసు . ఆ సన్నివేశాలు అన్నింటిని ఈ చిన్న అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. ముఖ్యంగా తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నంత భరోసాను ఇస్తూ ఆమె తల్లి ఆమెను చాలా గొప్పగా పెంచుతుంది అంటూ ప్రశంసలు కురిపించారు.
