'బేబి' హిందీ వెర్షన్ వివాదాలు షురూ
జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు చిత్రం `బేబి`(2023) హిందీ వెర్షన్ చిత్రీకరణ కోసం రంగం సిద్ధమవుతోంది.
By: Sivaji Kontham | 8 Sept 2025 8:30 AM ISTజాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు చిత్రం `బేబి`(2023) హిందీ వెర్షన్ చిత్రీకరణ కోసం రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు సాయి రాజేష్ హిందీ వెర్షన్ కోసం స్క్రిప్టును మరింత బెటర్ మెంట్ చేసానని ఇటీవల సైమా అవార్డుల వేడుకలో వెల్లడించారు. తెలుగు వెర్షన్ విషయంలో వివాదాలు చెలరేగినట్టే, హిందీ వెర్షన్ విషయంలోను వివాదాలు చెలరేగడం ఖాయమని అన్నారు.
ఇలాంటివి సోషల్ మీడియాలో కొందరు సృష్టిస్తారు. దాంతో సినిమా ఆదరణకు సంబంధం లేదని సాయి రాజేష్ అన్నారు. బేబి సినిమాపై విమర్శలు వచ్చినా ప్రజలు బాగా ఆదరించారని అన్నారు. ఇప్పుడు హిందీ వెర్షన్ కూడా ఇదే విధంగా విమర్శలతో పాటు ఆదరణ దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ సూరి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం `సయ్యారా` ఇటీవల హిందీ బెల్ట్‌లో విజయం సాధించిన నేపథ్యంలో, ఇప్పుడు బేబి లాంటి ప్రేమకథా చిత్రానికి ఉత్తరాదిన ఆదరణ లభిస్తుందని అందరూ భావిస్తున్నారు.
హిందీ వెర్షన్ కోసం తారాగణాన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ని ఎంపిక చేసుకున్నా అతడు సృజనాత్మక విభేధాల కారణంగా వైదొలిగాడని కథనాలొచ్చాయి. త్వరలోనే కాస్టింగ్ ఎంపికలు పూర్తి చేసుకుని, సినిమాని అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇటీవల సైమా అవార్డుల రెడ్ కార్పెట్ ఈవెంట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. హిందీ వెర్షన్‌లో కొన్ని మార్పులను చేసానని ఒరిజినల్ స్టోరి కంటే మెరుగ్గా ఉందని తెలిపారు. ఇక ఇందులో వివాదాస్పద అంశాలను అస్సలు మార్చలేదని కూడా చెప్పారు. తెలుగు వెర్షన్ తరహాలోనే హిందీలోను ఒక సెక్షన్ నుంచి విమర్శలు ఎదరవ్వొచ్చని కూడా అన్నారు.
