Begin typing your search above and press return to search.

14 లోకాల పురాణగాథలోకి 'బాహుబలి'! ఆలోచ‌న స‌రే.. ఇదెలా సాధ్యం?

పాన్ ఇండియాలో రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబలి` ఫ్రాంఛైజీ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు.

By:  Sivaji Kontham   |   27 Jun 2026 10:43 AM IST
14 లోకాల పురాణగాథలోకి బాహుబలి! ఆలోచ‌న స‌రే.. ఇదెలా సాధ్యం?
X

పాన్ ఇండియాలో రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబలి` ఫ్రాంఛైజీ సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాల‌తో క‌థ ముగియ‌లేదు. ఇప్పుడు బాహుబ‌లి పాత్ర‌ల‌తో మ‌రో కొత్త ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. `ది ఎటర్నల్ వార్` పేరుతో యానిమేష‌న్ సిరీస్ కి రంగం సిద్ధం చేసారు. ఈ సిరీస్ తో బాహుబ‌లి ప్రపంచాన్ని మరింత వినూత్నంగా విస్తరించేందుకు దర్శక‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా `బాహుబలి` పాత్రలను భారతీయ పురాణాల్లోని 14 లోకాలలోకి తీసుకువెళ్లాలనే అద్భుతమైన ఐడియాతో యానిమేషన్ క్రియేటర్ ఇషాన్ శుక్లా జక్కన్నను ఒప్పించ‌డం ఇండస్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధారణంగా రాజులు దేవుళ్లు కాదు కదా! మరి వారు పురాణాల్లోని 14 లోకాల్లో ఎలా ప్రయాణించగలరనే సందేహం అందరికి క‌లుగుతుంది. అయితే ఇషాన్ శుక్లా తెచ్చిన ఈ ఆలోచన విన్న తక్షణమే ``మనం ఎదురుచూస్తున్న క్షణం ఇదే`` అని తనకు అనిపించిందని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. కేవలం ఆలోచనగా వదిలేయకుండా... దానిని ఒక అద్భుతమైన కథగా విస్తరించడంలోనే అసలైన సవాల్ దాగి ఉందన్నారు ఆయ‌న‌. దీని అర్థం.. పురాణాల్లోకి బాహుబ‌లి పాత్ర‌ను జొప్పించ‌డం అనే ప్ర‌క్రియ‌ను శుక్లాజీ ఛాలెంజింగ్‌గా నిరూపించాల్సి ఉంటుంది.

`బాహుబలి` చుట్టూ ఇప్పటికే చాలా రచనలు, విస్తృతమైన చరిత్ర నిర్మితమై ఉన్నందున దానిని యానిమేటెడ్ సీక్వెల్ రూపంలో పొడిగించడం సహజంగానే జరిగిందని రాజమౌళి పేర్కొన్నారు. `వారణాసి` వంటి ఫీచర్ ఫిల్మ్‌పై పనిచేస్తూనే.. ఇషాన్ శుక్లా ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను సమతుల్యం చేసుకుంటున్నారు. `బాహుబలి` ప్రపంచంపై ఇషాన్ శుక్లాకు ఎంతవరకు అవగాహన ఉందో మొదట పరీక్షించామని... ఆ పాత్రల స్వభావాన్ని అతడు సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడని నిర్ధారించుకున్నాకే తాను వెనక్కి తగ్గి... వారిని ముందుకు సాగనిచ్చానని జక్కన్న తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి పర్యవేక్షణలోనే ఈ యానిమేషన్ సిరీస్ `ది ఎటర్నల్ వార్` స్క్రిప్ట్ రూపకల్పన శరవేగంగా సాగుతోందని కూడా తెలుస్తోంది.

భారతదేశంలో లైవ్ యాక్షన్ చిత్రాలతో పోలిస్తే యానిమేషన్ పరిశ్రమ ఇంకా కొంత వెనుకబడే ఉన్నా..`బాహుబలి`ని ఈ మాధ్యమంలోకి తీసుకువెళ్లాలనే నిర్ణయంపై రాజమౌళికి పూర్తి నమ్మకం ఉంది. సరైన వ్యక్తి, సరైన బృందం తోడైతే ఈ మాధ్యమంలో కూడా తిరుగులేని విజయం సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. `బాహుబలి` ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అప్పటికే సగం పని పూర్తయి ఉంటుందని... ఇషాన్ శుక్లా లాంటి ప్రతిభావంతుడు తోడవ్వడం వల్ల ఈ ముందడుగు వేయడం మరింత సులువైందని రాజమౌళి నమ్మకంగా చెబుతున్నారు.

`ది ఎటర్నల్ వార్` మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఈ యానిమేషన్ మాధ్యమం భారతీయ కథలలోని అందమైన రంగును సంపూర్ణంగా ఆవిష్కరిస్తుందని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఇక్కడ రంగు అంటే కేవలం విజువల్స్ మాత్రమే కాదు... పాత్రలు, భావోద్వేగాలు .. వాటిని ప్రదర్శించే విధానం కూడా చాలా రంగులమయంగా... భారతదేశానికి సంబంధీక‌మైనదిగా ఉంటుంది. ఇప్పటికే `బాహుబలి` లేదా RRR చిత్రాల రుచి చూసిన ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు ఇవే జాన‌ర్ ల‌లో మరిన్ని వినూత్న చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారని... లైవ్ యాక్షన్‌లో చూపించలేని అద్భుతాలను యానిమేషన్ ద్వారా సులభంగా చూపించవచ్చని జక్కన్న స్పష్టం చేశారు.

నా దృష్టిలో సినిమా భారీతనానికి భావోద్వేగమే కారణం. నేను వాటిని ఎప్పుడూ రెండు వేర్వేరు విషయాలుగా చూడను. భావోద్వేగం ఒక విత్తనం అయితే- దృశ్య వైభవం దాని లోపల దాగి ఉన్న చెట్టు! అంటూ రాజ‌మౌళి ప్ర‌ఖ్యాత `వెరైటీ డాట్ కాం`కి వెల్ల‌డించారు.

యానిమేటెడ్ మాధ్యమ సౌలభ్యంతో `ది ఎటర్నల్ వార్` కథను అత్యంత అద్భుతమైన స్థాయికి చేర్చవచ్చని చిత్ర బృందం నమ్ముతోంది. అయితే ఎంత విజువ‌ల్ వైభవం ఉన్నా అది కథలోని ప్రాణమైన భావోద్వేగాన్ని అధిగమించకూడదనేది రాజమౌళి సిద్ధాంతం. విత్తనం లాంటి భావోద్వేగం నుండి ఒక మహా వృక్షం లాంటి దృశ్య వైభవం ఎలా వికసిస్తుందో తనకు బాగా తెలుసని.. `ది ఎటర్నల్ వార్` క‌చ్చితంగా ఆ విజువ‌ల్ వండ‌ర్ రూప‌కాన్ని సాకారం చేస్తుందని రాజమౌళి ఎంతో ఆశాభావాన్ని క‌న‌బ‌రిచారు. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ విష‌యానికి వ‌స్తే.. రాజ‌మౌళి ఓవైపు `వార‌ణాసి`కి సంబంధించిన ప్యాచ్ వ‌ర్క్ ని వేగంగా పూర్తి చేస్తున్నార‌ని స‌మాచారం.